జైలు నుంచి విడుద‌లైన‌ శ‌శిక‌ళ

చెన్నై : అన్నాడీఎంకే బ‌హిష్కృత నేత శ‌శిక‌ళ జైలు నుంచి విడుద‌ల అయ్యారు. అవినీతి కేసులో శ‌శిక‌ళ నాలుగేళ్ల జైలు శిక్ష అనుభ‌వించింది. ఈ శిక్ష నేటితో పూర్తి అయింది. అయితే కొద్దిరోజుల క్రితం.. క‌రోనా బారిన‌ప‌డ్డ శ‌శిక‌ళ బెంగ‌ళూరు విక్టోరియా ఆస్ప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రి 20వ తేదీ నుంచి ఆమె క‌రోనా చికిత్స పొందుతున్నారు. ఈ క్ర‌మంలో ఆమె విడుద‌ల‌కు సంబంధించిన ప్ర‌క్రియను ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైలు అధికారులు ఆస్ప‌త్రిలోనే పూర్తి చేశారు. ఇప్పటికే శశికళ జైలు నుంచి విడుదలయ్యేందుకు ఆమె రూ.10కోట్ల జరిమానా చెల్లించారు. 2017 ఫిబ్ర‌వ‌రిలో అక్ర‌మాస్తుల కేసులో శ‌శిక‌ళ‌ను అరెస్టు చేశారు.

జయలలిత చనిపోయిన సమయంలో శశికళ అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టి సీఎం కావాలని ప్రయత్నాలు చేశారు. కానీ అక్ర‌మాస్తుల‌ కేసుల్లో దోషిగా తేలడంతో ఆమె జైలుకు వెళ్లారు. తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం పార్టీని సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పనీర్‌సెల్వం నడిపిస్తున్నారు. 2021 ఎన్నికల్లో  సీఎం అభ్యర్థి పళనిస్వామి అని పనీర్‌సెల్వం ప్రకటించారు. అదే రోజు శశికళకు చెందిన ఆస్తులను అటాచ్‌ చేస్తున్నట్టు ఐటీ శాఖ ప్రకటించడం గమనార్హం.

నాలుగైదు రోజుల్లో ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి

క‌రోనా బారిన‌ప‌డ్డ శ‌శిక‌ళ ఆరోగ్యం ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉంద‌ని బెంగ‌ళూరు విక్టోరియా ఆస్ప‌త్రి వైద్యులు స్ప‌ష్టం చేశారు. మ‌రో నాలుగైదు రోజుల పాటు శ‌శిక‌ళ ఆస్ప‌త్రిలోనే ఉంటుంద‌ని ఆస్ప‌త్రి మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ తెలిపారు. డిశ్చార్జి విష‌యంపై కుటుంబ స‌భ్యులు వైద్యుల‌తో చ‌ర్చిస్తున్నారు.