రైతు ఉద్యమానికి గ్రామస్థులు రాకపోతే రూ.1500 జరిమానా..!

ఛండీగఢ్‌ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాంటూ రైతులు గత రెండు నెలలుగా ఉద్యమం చేస్తున్నారు. మొన్నటి గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్లతో ర్యాలీ జరిపిన రైతులు.. ఇప్పుడు ఇంకా ఢిల్లీ శివారులోనే తిష్టవేసుకుని ఉన్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వారకు ఉద్యమిస్తామని ఇప్పటికీ రైతులు చెప్తూనే ఉన్నారు. రైతుల ఉద్యమం నేపథ్యంలో పంజాబ్‌ బటిండాలోని ఓ గ్రామం రైతు ఉద్యమానికి గ్రామస్థులు తప్పనిసరిగా హాజరుకావాల్సిందే అంటూ హుకూం జారీ చేసింది. పంజాబ్‌లోని విర్క్‌ ఖుర్ద్‌ అనే గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మంజీత్‌ కౌర్‌ ఉన్నారు. మనందరి కోసం ఉద్యమిస్తున్న రైతులకు అండగా నిలిచేందుకు గ్రామస్థులు అందరూ.. కుటుంబం నుంచి కనీసం ఒక్కరు ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఫర్మానా జారీ చేశారు. అంతటితో ఆగకుండా ఎవరైతే ఈ ఉత్తర్వులను పట్టించుకోరో.. వారికి రూ.1500 జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు. జరిమానా చెల్లించని కుటుంబాలను సాంఘిక బహిష్కరణ కూడా చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇలాఉండగా, సింఘూ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతులు, స్థానికుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకున్నది. అనాలోచిత చర్యల కారణంగా మేమంతా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని, తక్షణమే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ స్థానికులు రైతులను డిమాండ్ చేశారు. ఈ సమయంలో స్థానికులపై కొందరు రాళ్లు విసరడంతో పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. కాగా, ఉద్యమం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించిన భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) లోక్‌శక్తి వర్గం తిరిగి ఉద్యమంలోకి రానున్నట్లు ప్రకటించింది.