న్యూఢిల్లీ: ప్రముఖ గాయకుడు నరేంద్ర చంచల్ (80) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పంజాబ్‌లో జన్మించిన నరేంద్ర చంచల్.. ‘భజన్ కింగ్’గా గుర్తింపు సాధించారు. ఆధ్యాత్మిక భజనలతోపాటు పలు హిందీ పాటలు ఆలపించిన ఆయన బాబి సినిమాలోని ‘బేషక్ మందిర్ మసీద్’ పాటకు గానూ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నారు. నరేంద్ర చంచల్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తంచేశారు. తన మధురమైన గానంతో చంచల్ ఆధ్యాత్మిక ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారని ప్రధాని గుర్తుచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దిగ్గజ గాయకురాలు లతా మంగేష్కర్ కూడా సోషల్ మీడియా వేదికగా నరేంద్ర చంచల్‌కు నివాళులు అర్పించారు. భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా చంచల్ మృతిపట్ల విచారం వ్యక్తంచేశాడు. అంతేగాక పలువురు సినీ ప్రముఖులు, కేంద్ర సాంస్కృతిక శాఖ చంచల్‌ను స్మరించుకుంటూ ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించింది.
