న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.5 మేర తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిపై ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 50 శాతం మేర తగ్గించాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పెట్రోల్ ధరలు కనీసం రూ.5 వరకూ తగ్గనుంది. ఈ మధ్యే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త రికార్డును తాకిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో తొలిసారి పెట్రోల్ ధర లీటర్‌కు రూ.84 దాటిపోయింది. ఇలాంటి సమయంలో ఎక్సైజ్‌డ్యూటీని తగ్గిస్తే వాటి ధరలు దిగి వస్తాయి. నిజానికి గతేడాది లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని రూ.10 వరకూ పెంచింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను పెంచాయి. ఇప్పుడు ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతోపాటు కొంత భారాన్ని ఆయిల్ కంపెనీలు భరించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కోరనుంది.