పశ్చిమ బెంగాల్‌ బీజేపీలోకి నటుడు మిథున్‌ చక్రవర్తి?

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేంద్రు అధికారి గత ఎన్నికల్లో బరిలో నిలిచిన నందిగ్రామ్‌ నుంచి పోటీచేస్తున్నట్లు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అదేవిధంగా మొత్తం అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. మమతకు చెక్‌ పెట్టేందుకు బీజేపీ నేతలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ నటులను పార్టీలో చేర్చుకున్న బీజేపీ నేతలు.. ఇప్పుడు స్టార్‌ హీరో మిథున్‌ చక్రవర్తికి కండువా కప్పేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం కోల్‌కతాలోని బ్రిగేడ్‌ మైదానంలో జరుగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభలో మిథున్‌ చక్రవర్తి.. బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ కూడా బీజేపీలో చేరవచ్చని పార్టీలు తెలిపాయి.

బీజేపీ కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం నింపేందుకు అన్ని జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సమీకరించి ప్రధాని మోదీ బహిరంగసభకు పశ్చిమ బెంగాల్‌ బీజేపీ నేతలు ప్లాన్‌ చేశారు. ఆదివారం కోల్‌కతాలోని బ్రిగేడియర్‌ మైదానంలో సాయంత్రం ప్రధాని మోదీ హాజరై ప్రసంగిస్తారు. ఇదే సమయంలో బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఇదే సమయంలో సౌరవ్‌ గంగూలీ కూడా చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత నెలలో ముంబైలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో మిథున్‌ చక్రవర్తి సమావేశమయ్యారు. అప్పటి నుంచి మిథున్‌ దాదా బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపించాయి. అంతకుముందూ నాగ్‌పూర్‌లో కూడా భగవత్‌తో దాదా నాలుగైదు గంటలపాటు భేటీ అయ్యారు. మిథున్‌ చక్రవర్తి బీజేపీలో చేరితే అంతకుమించి ఏంకావాలి? అని స్థానిక బీజేపీ ఉపాధ్యక్షుడు అర్జున్‌ సింగ్‌ అన్నారు. ఆయన ఎక్కడి నుంచి కోరుకుంటే అక్కడి నుంచి పోటీ చేసేందుకు టికెట్‌ ఇస్తామని తెలిపారు. మిథున్‌ దాదా పార్టీలో చేరడం అటు బీజేపీతో పాటు పశ్చిమ బెంగాల్‌కు కూడా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజ్యసభకు పంపిన టీఎంసీ

మిథున్‌ చక్రవర్తిని గౌరవిస్తూ అధికార టీఎంసీ ప్రభుత్వం ఆయనను 2014 లో రాజ్యసభకు ఎంపికచేసింది. అయితే, వ్యక్తిగత కారణాలతో ఆయన 2016 డిసెంబర్‌ 29 న రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి మమతా బెనర్జీతో దూరంగా ఉంటున్నారు. మిథున్‌ చక్రవర్తి పేరు శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులో ఉండటం కొసమెరుపు.