12 రూపాయలు పెరగనున్న పాల ధర!

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. వాటి ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతున్నది. వ్యాపారులు ఒక్కో వస్తు  సేవల ధరలను క్రమంగా పెంచుతున్నారు. ఈ క్రమంలో వచ్చే నెల 1 నుంచి పాల ధరలను రూ.12 మేర పెంచాలని పాల ఉత్పత్తిదారులు నిర్ణయించారు. దీంతో మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌ పట్టణంలో లీటర్‌ పాల ధర రూ.55కు చేరనుంది. పట్టణంలోని కూరగాయలు, పాల ఉత్పత్తిదారుల సమావేశం ఈనెల 23న జరిగింది. ఈ సందర్భంగా పాల ధలను పెంచాలను నిర్ణయించారు. రత్లామ్‌లో ప్రస్తుతం లీటర్‌ పాలు రూ.43గా ఉన్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పాల ధరలు కూడా పెంచాలని రత్లామ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హీరాలాల్‌ చౌదరీ డిమాండ్‌ చేశారు. గతేడాది పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినప్పటికీ.. కరోనా వైరస్‌ నేపథ్యంలో పాల ధరలను పెంచలేదన్నారు. తాము ఒక్కో బర్రెను రూ. లక్ష నుంచి రూ.1.5 లక్షలకు కొనుగోలు చేశామని, ప్రస్తుతం లీటర్‌ పాల ధర రూ.43గా ఉందని చెప్పారు. ఖర్చులు పెరుగుతుండటంతో పాల ధరను రూ.55కు పెంచాల్సి వస్తుందన్నారు. పెట్రో ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు, దానా చుక్కులనంటాయని తెలిపారు. పాల ధరల పెంపునకు అనుమతించకపోతే ఉత్పత్తిని నిలిపివేస్తామని హెచ్చరించారు.