నా బాధ కంటే ప్ర‌జ‌ల బాధే ఎక్కువ

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ వీల్‌చైర్‌లో కూర్చొనే ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు. ఆదివారం నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్న ఆమె.. సోమ‌వారం కోల్‌క‌తా నుంచి 300 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి పురూలియా ర్యాలీకి చేరుకున్నారు. నా బాధ కంటే ప్ర‌జ‌ల బాధే ఎక్కువ అని ఈ సంద‌ర్భంగా మ‌మ‌త అన్నారు. నందిగ్రామ్‌లో నామినేష‌న్ వేసిన త‌ర్వాత జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఆమె గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ఆమె ఎడ‌మ కాలు విరిగింది. దీనిపై మ‌మ‌త స్పందిస్తూ.. ఓ ఘ‌ట‌న‌లో నేను గాయ‌ప‌డ్డాను. నిజానికి అదృష్ట‌వ‌శాత్తూ జీవించి ఉన్నాను. నా కాలికి ప‌ట్టీ ఉంది. నేను న‌డ‌వ‌లేను. ఈ విరిగిన కాలితో నేను అడుగు కూడా బ‌య‌ట‌పెట్ట‌లేన‌ని కొంద‌రు అనుకున్నారు అని అన్నారు. 2019 లోక్‌స‌భ‌లో ఇక్క‌డ బీజేపీ గెల‌వ‌డంపై కూడా మ‌మ‌త స్పందించారు. బీజేపీ అబ‌ద్ధాలు చెప్పి ఇక్క‌డ గెలిచింది. వాళ్లు అన్నీ అమ్ముతున్నారు. మేము అభివృద్ధి చేస్తుంటే బీజేపీ మాత్రం పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ ధ‌ర‌లు పెంచేస్తోంది అని మ‌మ‌త విమ‌ర్శించారు.