రెండు పడవల్లో ప్రయాణానికి సిద్ధమవుతున్న కమల్ హసన్

తమిళ సూపర్ స్టార్లలో ఒకడైన రజనీ కాంత్ రాజీకీయాలకు స్వస్తి చెప్పగా, మరో సూపర్ స్టార్ , మక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్ మాత్రం అసెంబ్లీ ఎన్నికలకు ఉత్సాహంగా, జోరుగా హుషారుగా సిద్దమవుతున్నాడు. శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ వందకుపైగా స్థానాలను కైవసం చేసుకుంటుందని మక్కల్‌ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూస్తేనే ఈ విషయం స్పష్టమవుతోందని, ఈ విషయాన్ని అన్ని పార్టీలు గ్రహించాయని అన్నాడు. అసెంబ్లీ ఎన్నికల కోసం కమల్‌ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాడు. ఇప్పటికే నాలుగు దశల ప్రచారం పూర్తి చేశాడు. దీన్నిబట్టి చూస్తే ఆయన ఎంత సీరియస్ గా ఉన్నాడో అర్ధమవుతోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే చేసే పనులను కూడా ఆయన ప్రచారంలో వివరిస్తున్నాడు.  ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతి చోటా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మురిసిపోతున్నాడు. రాష్ట్రంలో పరిశ్రమల రంగం దెబ్బతిన్నదని, ఈ రంగానికి పునరుత్తేజం కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో తాను చెన్నై నగరంలోని మైలాపూర్‌ స్థానంలో  బరిలోకి దిగుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు. కానీ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడో చెప్పలేదు. అలాగే, ఎన్నికల పొత్తుపై ఇప్పుడే తన అభిప్రాయాన్ని చెప్పలేనని అన్నాడు. రాజకీయాల కోసం సినిమాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదని అన్నాడు. అదేసమయంలో తన సంపాదన కోసం ఒక మార్గం ఉండటంలో తప్పు లేదన్నాడు. కమల్‌ హాసన్‌ పార్టీకి కానుం పొంగల్‌ రోజున భారత ఎన్నికల సంఘం తీపికబురు చెప్పింది. పార్టీ మక్కల్‌ నీది మయ్యంకు ఎన్నికల సంఘం టార్చ్‌లైట్‌ను ఎన్నికల చిహ్నంగా కేటాయించినట్టు కమల్‌హాసన్‌ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ప్రకటించాడు. తొలుత టార్చ్‌లైట్‌ను కేటాయించిన ఎన్నికల సంఘం ఆ తర్వాత బ్యాట్‌ను కేటాయించింది. అయితే, తమకు టార్చ్‌లైట్‌ను చిహ్నంగా కేటాయించాలని కోరుతూ ఎంఎన్‌ఎం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తమ పార్టీకి బ్యాటరీ టార్చ్‌లైటను ఎన్నికల గుర్తుగా కేటాయించినట్టు ఈసీ వెల్లడించిందని కమల్‌హాసన్‌ తెలిపాడు.