మేం బతకాలంటే మాకు తుపాకీ అవసరం..తుపాకీ లైసెన్స్‌ ఇవ్వండి.. పోలీసులకు హత్రాస్‌ యువతి విజ్ఞప్తి

హత్రాస్: ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన హత్రాస్‌ కేసులో నిందితుల నుంచి రక్షణ పొందేందుకు తుపాకీ కొనుగోలుకు లైసెన్స్‌ ఇవ్వాలని బాధిత కుటుంబానికి చెందిన యువతి పోలీసులకు విజ్ఞప్తి చేసంది. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆమె వినతిపత్రం పంపింది. హత్రాస్‌ కేసులో ప్రధాన నిందితుడైన గౌరవ్‌ శర్మ నుంచి తమకు ప్రాణహాని ఉన్నదని, ఆయనను అరెస్ట్‌ చేయడంలో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తుండటంతో తమకు మరేదైనా జరిగే అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపింది. హత్రాస్‌లో పశుగ్రాసం కోసం వెళ్లిన 19 ఏండ్ల యువతిని నలుగురు దుండగులు సమీపంలోని చేనులోకి లాక్కెళ్లి లైంగినదాడి జరిపారు. ఈ ఘటన 2020 సెప్టెంబర్‌ 14 న జరిగింది. దవాఖానలో చికిత్స పొందుతూ ఆమె 2020 సెప్టెంబర్‌ 29 న కన్నుమూసింది. అనంతరం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఆమెకు పోలీసులు బలవంతంగా అంత్యక్రియలు జరిపించారన్న ఆరోపణలు వినిపించాయి. ఇటీవల సదరు బాధితురాలి తండ్రిని కూడా గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు.ఈ నేపథ్యంలో తనతోపాటు తన కుటుంబసభ్యులకు నిందితుల నుంచి ప్రాణహాని పొంచివున్నదని నిందితుల చేతిలో వేధింపులకు గురైన యువతి పేర్కొంటున్నది. పోలీసులు నిందితులకు వంత పాడుతున్నట్లు కనిపిస్తున్నందున.. తమను తాము రక్షించుకునేందుకు తుపాకీ కొనుక్కోవడం ఒక్కటే శరణమ్యమని నమ్ముతున్నామని, దానికి లైసెన్స్‌ ఇప్పించాలని పోలీసులను కోరినట్లు ఆమె తెలిపారు. ‘తమ తండ్రిని హతమార్చి ఐదు రోజులు గడుస్తున్నా వారిని పోలీసులు ఇంతవరకు అరెస్ట్‌ చేయలేదు. వారితో ఏదైనా జరుగొచ్చు. మేం బతకాలంటే మాకు తుపాకీ అవసరం. ప్రస్తుతానికి ఉన్న పోలీసు భద్రతను ఉపసంహరించుకున్న తర్వాత మాకు దిక్కెవరు? అప్పుడు మాకు రక్షణ ఎలా..?’ అంటూ సదరు యువతి స్పష్టం చేసింది. గౌరవ్‌ శర్మ మాతో వాగ్వాదం పెట్టుకున్న విషయాన్ని పోలీసులకు చేరవేసినా వాళ్లు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. సంఘటనాస్థలానికి పోలీసులు రాకుండా 112 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయాలని ఉచిత సలహా ఇచ్చారని ఆమె చెప్పారు. కాగా, ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రధాన నిందితుడు గౌరవ్‌ శర్మను మాత్రం ఇంకా అరెస్ట్‌ చేయకపోవడం విశేషం. గౌరవ్‌ శర్మ తలపై రూ.1 లక్ష రివార్డును పోలీసులు ప్రకటించారు.