బ్రిటన్‌ విమానాలు నిషేదం

కొత్త రకం కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మహమ్మారి ముప్పు త్వరలో తొలగిపోనుందన్న ఆశలపై నీళ్లు చల్లుతూ.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర వైరస్‌గా గుర్తింపు పొంది, ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. బ్రిటన్‌లో మొదట గుర్తించిన ఈ ‘వీయూఐ 202012/1’ వైరస్‌ ఇప్పటివరకు డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లోనూ అడుగుపెట్టింది. కొత్త తరహా వైరస్‌ అదుపు చేయలేని స్థాయిలో వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్‌.. ఆదివారం నుంచి పౌరులపై అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌ ఆంక్షలను విధించింది.

పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని బ్రిటన్‌ ఆరోగ్య శాఖ మంత్రి మేట్‌ హన్‌కాక్‌ పేర్కొన్నారు. ‘ప్రజలంతా, ముఖ్యంగా టయర్‌ –4 ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాలవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైరస్‌ తమకు కూడా సోకిందన్నట్లుగానే జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే దీన్ని నియంత్రించగలం’ అని విజ్ఞప్తి చేశారు. కొత్త రకం వైరస్‌ 70% వేగంగా వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. అది ఎక్కువ ప్రాణాంతకం అనేందుకు ఆధారాలేవీ లభ్యం కాలేదని, టీకాకు కూడా.. గత వైరస్‌తో పోలిస్తే వేరుగా స్పందిస్తుందనేందుకూ ఆధారాల్లేవని వివరించారు. ఉత్తర ఐర్లాండ్‌ మినహా బ్రిటన్‌ అంతటా ఈ వైరస్‌ను గుర్తించారు. ముఖ్యంగా లండన్, తూర్పు ఇంగ్లండ్, ఆగ్నేయ ఇంగ్లండ్‌ ప్రాంతాల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంది.