అమ్మాయిలు జీన్స్ ధరిస్తే సంఘ బహిష్కరణే…క్షత్రియ పంచాయతీ ఆదేశం

మీరట్‌ : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్‌కు చెందిన క్షత్రియ పంచాయతీ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అమ్మాయిలు జీన్స్‌ ధరించవద్దని క్షత్రియ పంచాయతీ తీర్మానించింది. ఈ కట్టుబాటును కాదని ఎవరైనా అమ్మాయిలు జీన్స్‌ ధరించినట్లయితే వారిపై సంఘ బహిష్కరణ విధిస్తామని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా, అబ్బాయిలు కూడా నిక్కర్లు ధరించవద్దని, అలాకాదని నిక్కర్లు ధరించేవారికి కూడా ఇదే జరిమానా ఉంటుందని క్షత్రియ పంచాయతీ స్పష్టం చేసింది. అమ్మాయిలు జీన్స్‌ ధరించి తిరుగుతుండటం వల్ల వేధింపులు ఎక్కువవుతున్నాయని క్షత్రియ పంచాయతీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి విరుగుడుగా అమ్మాయిలు జీన్స్‌ ధరించకుండా చూస్తే బాగుంటుందని కొందరు చేసిన సూచనల మేరకు మంగళవారం క్షత్రియ పంచాయతీ సమావేశమై దీనిపై చర్చించి ఈ మేరకు ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలుచేయనున్నట్లు ప్రకటించింది. క్షత్రియ కులం గౌరవ మర్యాదలను పెంపొందించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని క్షత్రియ పంచాయతీ పెద్దలు తెలిపారు. అమ్మాయిలు, అబ్బాయిలు మన సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు ధరించాలని, అమ్మాయిలు జీన్స్‌ ధరించవద్దని, అబ్బాయిలు నిక్కర్లు వేసుకోవద్దని, ఈ కట్టుబాట్లను అతిక్రమించినవారికి జరిమానా విధిస్తామని, ఎక్కువ సార్లు పట్టుబడితే సంఘ బహిష్కరణ చేసేందుకు కూడా వెనుకాడమని వారు హెచ్చరిస్తున్నారు.