4 రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌ : నాలుగు రాష్ర్టాలు పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోం, ఓ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా సునీల్‌ ఆరోరా ఈ మేరకు ఆయా రాష్ర్టాల ఎన్నికల షెడ్యూల్‌ను మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని 294(ఎస్సీ-68, ఎస్టీ-16) శాసనసభ స్థానాలకు, తమిళనాడులోని 234(ఎస్సీ-44, ఎస్టీ-2) స్థానాలకు, కేరళలోని 140(ఎస్సీ-14, ఎస్టీ-2) స్థానాలకు, అసోంలోని 126(ఎస్సీ-8, ఎస్టీ-16) స్థానాలకు, పుదుచ్చేరిలోని 30(ఎస్సీ-5, ఎస్టీ-నిల్‌) శాసనసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ ప్రకటించింది. నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగే ఈ ఎన్నికల పోలింగ్‌ ఫలితాలను మే 2వ తేదీన ప్రకటించనున్నట్లు సీఈసీ తెలిపారు.

కరోనా జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపిన సీఈసీ నాలుగు రాష్ర్టాలు, ఒక యూటీలో మొత్తం 2.7 లక్షల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 18.68 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు చెప్పారు. పోలింగ్‌ సమయాన్ని గంటసేపు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు జరిగే ఈ రాష్ర్టాల్లో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. నాలుగు రాష్ర్టాల్లో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ.30.8 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఎలాంటి అవకతవకలున్నా సి-విజిల్‌ యాప్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు.

ఆయా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఈ విధంగా ఉంది.

అసోం :

మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ జరగనుంది. మొదటి దశలో 47 స్థానాలకు మార్చి 2వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల, మార్చి 27న పోలింగ్‌, రెండో దశలో 39 స్థానాలకు మార్చి 5న నోటిఫికేషన్‌ విడుదల. ఏప్రిల్‌ 1న పోలింగ్‌, మూడో దశలో 40 స్థానాలకు ఏప్రిల్‌ 6న పోలింగ్‌ నిర్వహణ. ఈ మూడు దశల పోలింగ్‌ను మే 2వ తేదీన కౌంటింగ్‌ చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు ఈ మూడు రాష్ర్టాలకు కలిపి ఒకే విడతలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 6న పోలింగ్‌ నిర్వహణ. మే 2వ తేదీన కౌంటింగ్‌.

పశ్చిమ బెంగాల్‌ :

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 8 దశల్లో పోలింగ్‌ నిర్వహణ. మొదటి దశ పోలింగ్‌ మార్చి 27న, రెండో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 1న, మూడో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 6న, నాల్గొవ దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 10, ఐదో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 17, ఆరో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 22, ఏడో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 26, ఎనిమిదో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 29న జరగనుంది. ఈ ఎనిమిది దశల పోలింగ్‌ కౌంటింగ్‌ను మే 2న చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.