న్యూఢిల్లీ : చారిత్రక ఎర్రకోటపై నిత్యం జాతీయ జెండా రెపరెపలాడే చోట మంగళవారం సిక్కు మత జెండా ఎగిరింది. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రధాని జాతీయ జెండా ఎగురవేసే బురుజుపై కొందరు యువకులు కాషాయ వర్ణంలో ఉండే సిక్కు పతాకాన్ని ఎగురవేశారు. ఆ హింస వెనుక ఎవరున్నారు? అనే అంశంపై పలువురిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సోమవారం రాత్రి ఏం జరిగింది?
సోమవారం సాయంత్రం నుంచి ట్రాక్టర్ పరేడ్ గురంచి యునైటెడ్ కిసాన్ మోర్చా ప్రతినిధులు, ఢిల్లీ పోలీసులకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఆ సమయంలో కొంత మంది యూత్ కలగజేసుకుని రూట్‌మ్యాప్ మార్చాలని పట్టుబట్టారు. ఆ యూత్‌లో గుర్తు పట్టగలిగిన వ్యక్తి ఒక్కరే.. అతను దీప్ సిద్దూ(40). ఇక అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదికపైకి దీప్ సిద్దూ వెళ్లి ప్రసంగం చేశాడు. మన నాయకత్వం తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుని ట్రాక్టర్ పరేడ్‌ను నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. అయితే రైతు సంఘాల ప్రతినిధులను సిద్దూ వేదికపైకి పిలిచాడు. ఒక వేళ వారు రాకపోతే మనమే నిర్ణయం తీసుకుందామని చెప్పాడు. వేలాది మంది యువత రింగ్ రోడ్డు వైపుగా ట్రాక్టర్ పరేడ్ నిర్వహించాలని కోరుకుంటోంది. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి కూడా రింగ్ రోడ్డువైపు వెళ్తుంది. వారిని అనుసరిద్దామని సిద్దూ ఆ వేదికపై నుంచి కోరాడు.
రెచ్చగొట్టి.. ఎర్రకోటపై జెండా
రైతుల ర్యాలీలో యువతను రెచ్చగొట్టిన దీప్ సిద్దూ.. ఎర్రకోట వైపు వెళ్లేలా ప్రణాళిక రచించాడు. దాంతో అందరూ అటు వైపు వెళ్లారు. ఇక కొందరు యువకులు ఏకంగా ఎర్రకోటపై సిక్కు జెండాను ప్రదర్శించాడు. ఆ తర్వాత అందరూ అక్కడ జాతీయ జెండాలతో పాటు సిక్కు జెండాలను ప్రదర్శించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
సిద్దూకు బీజేపీతో సంబంధం ఏంటి?
ఎర్రకోటపై సిక్కు జెండాను ప్రదర్శించిన సిద్దూకు బీజేపీతో సంబంధాలున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలు నిజమేనా? అంటే అవుననే తెలుస్తోంది. ఎందుకంటే సిద్దూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సన్ని డియోల్ తరపున ప్రచారం చేశాడు. అంతే కాదు.. ప్రధాని నరేంద్ర మోదీతో సన్నిడియోల్, దీప్ సిద్దూ కలిసి దిగిన ఫోటోలు కూడా బహిర్గతమయ్యాయి. దీంతో సిద్దూ బీజేపీ నేతనే అన్న వార్తలకు బలం చేకూరినట్లు అయింది. మొత్తానికి దీప్ సిద్దూపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దీప్ సిద్దూకు ఎన్ఐఏ నోటీసులు
దీప్ సిద్దూకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఇటీవలే నోటీసులు జారీ చేసింది. సిక్ ఫర్ జస్టిస్ కేసులో సిద్దూతో పాటు అతని సోదరుడు మన్‌దీప్ సింగ్‌కు కూడా ఎన్ఐఏ నోటీసులు ఇచ్చింది. ఇదే కాకుండా సిద్దూ క్రూరమైన నేరాలకు పాల్పడినట్లు కేసులు నమోదైనప్పటికీ, అన్ని కేసుల్లో నిర్దోషిగా బయటపడ్డాడు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దూ పోటీ చేశాడు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసి, ఇప్పుడు రైతు ఉద్యమానికి మద్దతుగా యువతను ప్రేరేపించాడు.
సిద్దూ@ గ్యాంగ్‌స్టర్
పంజాబ్‌లోని ముక్తసర్‌లో 1984లో జన్మించి దీప్ సిద్దూ న్యాయ విద్యను అభ్యసించాడు. 2015లో పంజాబ్ చిత్రం రమ్తా జోగి సినిమాలో సిద్దూ తొలిసారి నటించాడు. ఆ సినిమా హిట్ కావడంతో 2018లో జోరాదాస్ నంబ్రియా సినిమాలో గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక అప్పట్నుంచి అటు తెరపైనే కాకుండా.. నిజజీవితంలో కూడా గ్యాంగ్‌స్టర్ మాదిరిగానే సిద్దూ ఉంటున్నాడు.