బీహార్ రాజధాని పట్నా సిటీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. షాజహాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిగ్రియవాన్ గ్రామానికి చెందిన మహేశ్ (55) అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోగా.. అతని శవం తన అంత్యక్రియలకు డబ్బులు డ్రా చేయడం కోసం బ్యాంకుకు వెళ్లింది. శవం బ్యాంకుకు వెళ్లడం ఏమిటి అనుకుంటున్నారా..? కానీ నిజంగానే వెళ్లింది! అయితే తనకు తానుగా కాదులెండి.. గ్రామస్తులు తీసుకెళ్తే వెళ్లింది. మరి ఇంతకూ ఏం జరిగిందో తెలుసుకుందామా..?అనారోగ్యంతో మరణించిన మహేశ్‌కు తల్లిదండ్రలు ఎప్పుడో పోయారు. పెండ్లి కాలేదు. ఆ ఊర్లో తనకు చుట్టపక్కల తెలిసినోళ్లు కూడా ఎవరూ లేరు. దాంతో మహేశ్ అంత్యక్రియలు నిర్వహించాల్సిన బాధ్యత గ్రామస్తులపై పడింది. అంత్యక్రియలకు డబ్బు ఎలా అని ఆలోచిస్తున్న గ్రామస్తులకు మహేశ్‌కు స్థానిక కెనరా బ్యాంకులో అకౌంట్ ఉన్న సంగతి గుర్తుకొచ్చింది. వెంటనే గ్రామంలోని కొందరు వ్యక్తులు బ్యాంకుకు వెళ్లి మహేశ్ అకౌంట్‌లో బ్యాలెన్స్ చెక్ చేయించగా రూ.1,00,000 ఉన్నాయి. దాంతో గ్రామస్తులు బ్యాంకు మేనేజర్‌ను కలిసి మహేశ్ చనిపోయిన విషయం చెప్పారు. అంత్యక్రియల అతని ఖాతాలోని డబ్బును డ్రా చేసి ఇవ్వాలని కోరారు. కానీ బ్యాంకు మేనేజర్ అందుకు ఒప్పుకోలేదు. మహేశ్ తన ఖాతాకు నామినీగా ఎవరి పేరును నమోదు చేయనందున అతని డబ్బును డ్రా చేయడం కుదరదని చెప్పాడు. దాంతో గ్రామస్తులు మహేశ్ శవాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి ఆ శవానికి డబ్బులు ఇవ్వండని డిమాండ్ చేశారు. అయినా బ్యాంకు మేనేజర్ ససేమిరా అనడంతో గ్రామస్తులు శవాన్ని బ్యాంకు లోపలికి తీసుకెళ్లి గొడవకు దిగారు. దాదాపు మూడు గంటలపాటు బ్యాంకు మేనేజర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా గ్రామస్తులు వినిపించుకోలేదు. చివరికి చేసేదేమీ లేక బ్యాంకు మేనేజరే తన సొంత ఖాతాలోంచి రూ.10 వేలు డ్రా చేసి ఇచ్చారు. ఆ డబ్బు తీసుకెళ్లి గ్రామస్తులు మహేశ్ అంత్యక్రియలు పూర్తిచేశారు.
