డిసెంబర్‌ నాటికి దేశ ప్రజలందరికి టీకా

డిసెంబర్‌ నాటికి దేశ ప్రజలందరికి టీకా అందుతుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. వ్యాక్సినేషన్‌ విషయంలో కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని నడ్డా మండిపడ్డారు. రాజస్తాన్‌లో కోవిడ్‌ పరిస్థితులపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సతీష్‌ పునియాతో వర్చువల్‌ సమావేశంలో చర్చించారు.

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణలో ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కేంద్రం కోవిడ్‌ గురించి హెచ్చరించలేదని.. ఫలితంగా ఇప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపిస్తున్నాయి.

ఈ విమర్శలపై నడ్డా స్పందించారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ గురించి ప్రధాని మోదీ మార్చిలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను హెచ్చరించారని.. కరోనా సెకండ​ వేవ్‌కు సిద్ధంగా ఉండాలని సూచించారని నడ్డా తెలిపారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ‘‘దేశం తొలిసారిగా కేవలం 9 నెలల వ్యవధిలో రెండు స్వదేశీ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసింది.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 18 కోట్ల మందికి టీకా అందించాం. డిసెంబర్‌ చివర ఇనాటికి అందరికీ టీకా ఇస్తాం. ఈ మేరకు క్యాలెండర్‌ రూపొందించాం. రాష్ట్రాలకు ఆక్సిజన్‌, మందుల సరఫరలో మా ప్రభుత్వం చాలా బాగా పని చేస్తుంది’’ అని తెలిపారు.

ఇక టూల్‌కిల్‌ వెల్లడవ్వడంతో కాంగ్రెస్‌ అసలు నైజం జనాలకు తెలిసిందన్నారు నడ్డా. మహమ్మారి సమయంలో కూడా, దేశంలో అరాచకాన్ని, గందరగోళాన్ని వ్యాప్తి చేసి ప్రజల ధైర్యాన్ని నాశనం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తోందని నడ్డా ఆరోపించారు.