సామాన్యుడిపై బడ్జెట్ భారం…

కరోనాతో ఎక్కువగా నష్టపోయింది ఎవరైనా ఉన్నారంటే అది మధ్యతరగతి వర్గమే. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్లు తీవ్రంగా నష్టపోయారు. చిన్నచిన్న ఉద్యోగాలు చేసే వాళ్లు తమ జాబులు  పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మధ్యతరగతికి ఊరట కల్గించేలా బడ్జెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంతా భావించారు. అయితే మోడీ సర్కార్ మాత్రం మధ్యతరగతికి షాక్ ఇచ్చింది.ఆత్మనిర్భర్ ప్యాకేజీ అంటూ ఎలాగైతే మోడీ సర్కార్, మధ్యతరగతిని మసిపూసి మారేడుకాయ చేసిందో, ఇవాళ్టి బడ్జెట్ కూడా యథాతథంగా అలానే ఉంది. బడ్జెట్ మొత్తం మధ్యతరగతి జనాల చుట్టూనే తిరిగింది. కానీ వాళ్లకే పంగనామాలు పెట్టింది. ప్రత్యక్షంగా కాకుండా, పరోక్షంగా మధ్యతరగతిపై పెనుభారం మోపింది 2021-22 కేంద్ర ఆర్థిక బడ్జెట్.పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెంచబోతున్నారు. లీటర్ డీజిల్ పై 4 రూపాయలు వ్యవసాయ సెస్సు విధించారు. లీటర్ పెట్రోల్ పై 2 రూపాయల 5 పైసలు వ్యవసాయ సెస్సు విధించారు. మొబైల్ ధరలు పెంచారు. బంగారం, వెండిపై సెస్సు వేశారు. ఆటోమొబైల్స్ లో కస్టమ్స్ డ్యూటీ పెంచారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలకు చేరబోతోంది. ఇవన్నీ పరోక్షంగా మధ్యతరగతి వర్గాలపై పెనుభారం మోపేవే. చివరికి ఆదాయపు పన్ను శ్లాబుల్లో కూడా ఎలాంటి మార్పులు, మినహాయింపులు లేకపోవడం మధ్యతరగతిపై భారం పెంచింది.హైటెక్ గా (బడ్జెట్ యాప్, ట్యాబ్ చూసి ప్రసంగం) బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. మిడిల్ క్లాస్ ను మాత్రం దారుణంగా దెబ్బకొట్టారు. చివరికి మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలపై కూడా నీళ్లు చల్లింది ఈ ప్రభుత్వం. గృహరుణాల మినహాయింపుల మొత్తాన్ని పెంచుతారని ఆశిస్తే.. కేవలం  ఉన్న మినహాయింపుల్నే వచ్చే ఏడాది వరకు పొడిగించి చేతులు దులుపుకున్నారు. చివరికి స్టార్టప్ కంపెనీలకు కూడా కంటితుడుపు రాయితీలు తప్ప చెప్పుకోదగ్గవి లేవు.. ఉన్న మినహాయింపుల్నే మరో ఏడాది పొడిగించారంతే. మౌలిక రంగాలతో పాటు విద్య-వైద్యానికి ఎక్కువ కేటాయింపులు ఇచ్చామని కేంద్రం చెబుతున్నప్పటికీ.. వాటితో నేరుగా, ఉన్నఫలంగా మధ్యతరగతి వర్గాలకు లబ్ది చేకూరదు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులకు ఈ బడ్జెట్ పెద్ద దెబ్బ. మొత్తమ్మీద కరోనా/లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి వర్గాలకు ప్రత్యక్షంగా ఊరటనిచ్చే రాయితీలు/మినహాయింపులు లేకపోగా.. వారిపై పరోక్షంగా భారం పడే నిర్ణయాలే ఎక్కువగా ఉన్నాయి.