ఆన్‌లైన్‌ క్లాసుల దెబ్బకి పారిపోయిన బాలుడు

హఠాత్తుగా ఊడిపడ్డ కరోనా వల్ల పిల్లల చదువులు అటకెక్కాయి. అయితే ఇలా ఎంతకాలం విద్యార్థులు పాఠాలకు దూరం కావాలని ఆన్‌లైన్‌ క్లాసులకు తెర తీశారు. కానీ ఆన్‌లైన్‌ క్లాసులంటే అంత వీజీ కాదు. టీచర్‌ ఏం చెప్తుందో పిల్లోడికి సరిగా బుర్రకు ఎక్కదు.. అటు వాళ్లు శ్రద్ధగా వింటున్నారో తెలీదో ఇటు టీచర్‌కు కూడా అర్థమై చావదు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన పద్నాలుగేళ్ల బాలుడి పరిస్థితి కూడా అంతే.. ఎనిమిదవ తరగతి చదువుతున్న అతడికి ఆన్‌లైన్‌ పాఠాలు అంతగా అర్థం కాలేదు.

అలా అని మరోసారి పాఠాలు రిపీట్‌ చేయమని అడగనూలేడు. దీంతో పిచ్చెక్కిపోయిన బాలుడు ఓ లేఖ రాసి, ఇంటి నుంచి పారిపోయాడు. “అమ్మానాన్న, గతంలో నేను మిమ్మల్ని చాలా ఇబ్బందిపెట్టాను. కానీ ఇప్పుడు వెళ్లిపోతున్నా. ఆన్‌లైన్‌ క్లాసుల్లో చెప్తున్న పాఠాలేవీ నాకర్థం కావట్లేదు. మిమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు సారీ” అని లేఖ రాసి వెళ్లిపోయాడు.

దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంతలో బుధవారం నాడు పిల్లవాడి తండ్రికి ఫోన్‌కాల్‌ వచ్చింది. పిల్లోడు తన దగ్గరకే వచ్చాడని, అతడు క్షేమంగా ఉన్నాడంటూ భయందర్‌ నుంచి అతడి అంకుల్‌ సమాచారమిచ్చాడు. దీంతో కొడుకును కలిసేందుకు తల్లిదండ్రులు ఉన్నపళంగా ముంబై పయనమయ్యారు.

అయితే పిల్లోడు ఒంటరిగా అంతదూరం ఎలా ప్రయాణించాడన్నది మాత్రం తెలియరాలేదు. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. “నాలుగేళ్ల క్రితం అబ్బాయి కుటుంబం భయందర్‌లో నివసించేది. కానీ వాళ్లు సూరత్‌కు షిఫ్ట్‌ అవడంతో అతడు తన స్నేహితులను మిస్‌ అయ్యాడు. పైగా సూరత్‌లో ఉండటం అతకి పెద్దగా నచ్చలేదు. దీనికి తోడు ఆన్‌లైన్‌ క్లాసులు అర్థం కాకపోవడంతో ఇంటి నుంచి పారిపోయాడు” అని తెలిపారు.