ముంబై : అనుమతి లేకుండా ముంబై జుహులోని ఆరు అంతస్తుల నివాస భవనాన్ని హోటల్‌గా మార్చారనే ఆరోపణలపై నటుడు సోనుసూద్‌పై బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) చర్యలకు ఉపక్రమించింది. జుహు ఏబీనాయర్ రోడ్‌లోని శక్తి సాగర్ అనే నివాస భవనాన్ని అనుమతులు లేకుండా హోటల్‌గా మార్చినట్లు ఆరోపించింది. మహారాష్ట్ర రీజియన్ అండ్ టౌన్ ప్లానింగ్ (ఎంఆర్‌టీపీ) చట్టం ప్రకారం నేరంగా పేర్కొంటూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, హోటల్‌గా మార్చేందుకు తన వద్ద బీఎంసీ అనుమతులు ఉన్నాయని, మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎంసీజెడ్‌ఎంఏ) రావాల్సి ఉందని పేర్కొన్నారు. అక్టోబర్ 2020లో బీఎంసీ పంపిన నోటీసును సవాల్ చేస్తూ నగర సివిల్ కోర్టును ఆశ్రయించారు.కానీ, అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఇవ్వలేదు. హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు మూడువారాల సమయం ఇచ్చింది. సమయం పూర్తి కావడంతో ప్రణాళిక ప్రకారం మార్పులు, చేర్పులు చేయకపోవడంతో ఎంఆర్‌పీటీ చట్టంకింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఓ బీఎంసీ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా సోనుసూద్ స్పందిస్తూ.. భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయని, ఎంసీజెడ్‌ఎంఏ అనుమతి కొవిడ్ కారణంగా రాలేదని తెలిపారు. మహమ్మారి సమయంలో కొవిడ్ యోధులను ఉంచేందుకు ఈ హోటల్ వినియోగించినట్లు తెలిపారు. అనుమతులు రాకపోతే, భవనాన్ని తిరిగి నివాసంగా మారుస్తానని చెప్పాడు.
