ముంబై: చావుకు, బతుకుకు మధ్య క్షణమే తేడా అంటే ఇదేనేమో..! ఓ వృద్ధుడు రైల్వేస్టేషన్‌లోని ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు రైలు పట్టాల మీదుగా దాటబోయి రెప్పపాటులో ప్రమాదం తప్పించుకున్నాడు. ఒక్క క్షణం ఆలస్యమైనా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. సమయానికి అక్కడున్న రైల్వే కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించడం సదరు వృద్ధుడు ప్రాణాలతో బయటపడటానికి దోహదపడింది.మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దహిసార్ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ 60 ఏండ్ల వృద్ధుడు దహిసార్ రైల్వేస్టేషన్‌లోని ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు రైలు పట్టాల మీదుగా దాటే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతని చెప్పు ఊడి పట్టలపై పడిపోయింది. అదే సమయంలో స్టేషన్‌లోకి రైలు వస్తున్నా పట్టించుకోకుండా చెప్పు కోసం మళ్లీ పట్టాల మీదకు వెళ్లాడు. అయితే, అప్పటికే రైలు అత్యంత సమీపానికి చేరుకుంది. ఇది గమనించిన రైల్వే కానిస్టేబుల్ పరుగెత్తుకుంటూ వచ్చి పట్టాలపై పడుకోమని వృద్ధుడికి సైగ చేశాడు. అయితే సదరు వృద్ధుడు అతని సూచన పాటించకుండా రైలు కేవలం కొన్ని అడుగుల దూరం ఉండగానే దాని ముందు నుంచి ప్లాట్‌వైపు పరుగెత్తుకొచ్చాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వృద్ధుడి చేయిపట్టి లాగేయడంతో ప్రమాదం తప్పింది. వృద్ధుడిని పట్టాలపై నుంచి లాగి పడేసిన కానిస్టేబుల్ అతనితోపాటే ప్లాట్‌ఫామ్‌పై పడిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో కానిస్టేబుల్‌కు చిర్రెత్తుకొచ్చింది. తనతోపాటే ప్లాట్‌ఫామ్‌పై పడివున్న వృద్ధుడి తలపై గట్టిగా ఒక్కటి పీకాడు. అయినా, చాకచక్యంగా వ్యవహరించి వృద్ధుడి ప్రాణాలు కాపాడినందుకు ఉన్నతాధికారులు కానిస్టేబుల్‌ను అభినందించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
