51 ల‌క్ష‌ల లైట్ మోటార్ వాహ‌నాలు తుక్కే: నితిన్ గ‌డ్క‌రీ

న్యూఢిల్లీ: ద‌శ‌ల వారీగా పాత వాహ‌నాల‌ను తుక్కు చేసేందుకు కొత్త స్కీమ్‌ను ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ లోక్‌స‌భ‌లో తెలిపారు.  దీనిపై కేంద్ర రోడ్డు రవాణా, ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ మ‌రింత క్లారిటీ ఇచ్చారు.  స్క్రాపింగ్ పాల‌సీ కింద‌.. 20 ఏళ్లు దాటిన సుమారు 51 ల‌క్ష‌ల లైట్ మోటార్ వెహికిల్స్‌ను తుక్కు చేయ‌నున్న‌ట్లు గ‌డ్క‌రీ తెలిపారు.  దీని వ‌ల్ల దేశ ఆటోమొబైల్ ప‌రిశ్ర‌మ మ‌ళ్లీ ప‌రుగెడుతుంద‌ని చెప్పారు. 34 ల‌క్ష‌ల లైట్ మోట‌ర్ వాహ‌నాల‌కు 15 ఏళ్లు దాటింద‌ని, మ‌రో 51 ల‌క్షల వాహ‌నాల‌కు 20 ఏళ్లు దాటిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.  ఫిట్‌నెస్ ప‌త్రం లేని మీడియం, హెవీ క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల సంఖ్య 17 ల‌క్ష‌లుగా ఉంద‌ని, ఆ వాహ‌నాల‌కు 15 ఏళ్లు నిండాయ‌ని ఆయ‌న తెలిపారు.  పాత వాహ‌నాల‌ను తుక్కు చేయ‌డం వ‌ల్ల‌.. కాలుష్యం త‌గ్గుతుంద‌ని, వాహ‌నాల‌తో వ‌చ్చే కాలుష్యం 25 నుంచి 30 శాతానికి త‌గ్గుతుంద‌ని గ‌డ్క‌రీ తెలిపారు. దీని వ‌ల్ల రోడ్డు భ‌ద్ర‌త కూడా పెరుగుతుంద‌న్నారు.