ఢిల్లీలో నలుగురు దుర్మరణం

దేశ రాజధాని ఢిల్లీలోని విష్ణు గార్డెన్‌ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. రెండతస్తుల భవనం పైకప్పు కూలి నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రమాదం నెలకొన్న ఆ ఇంటిని మోటార్‌ వైండింగ్‌ ఫ్యాక్టరీగా ఉపయోగిస్తున్నారు.

ఈ ప్రమాదంపై అదనపు డిప్యూటీ కమిషనర్‌ సుభోద్‌ కుమార్‌ గోస్వామి మాట్లాడుతూ ‘ఉదయం 10 గంటల సమయంలో భవనం పైకప్పు కూలినట్లు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆ సమయంలో ఆరుగురు ఫ్యాక్టరీలో ఉన్నారు. వారిని పోలీసులు రక్షించి, సమీప ఆస్పత్రికి తరలించాం. అయితే అప్పటికే వారిలో నలుగురు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు’ అని చెప్పారు.