న్యూఢిల్లీ, మార్చి 14: ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేట్‌కు కట్టబెడుతున్న మోదీ సర్కారు మరింత దూకుడు పెంచింది. లాభాల్లో ఉన్న పలు మహారత్న, నవరత్న కంపెనీలను ఇప్పటికే అమ్మకానికి పెట్టిన ఎన్డీయే ప్రభుత్వం చూపు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆస్తులపై మళ్లీ పడింది. ఇప్పటికే రెండు దశల్లో పలు విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేసిన అధికార బీజేపీ.. మరికొద్ది రోజుల్లో దేశంలోని మరో 13 విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేయబోతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించాయి. విక్రయించే విమానాశ్రయాల జాబితాలో కొన్ని లాభార్జనలో ఉన్న ఎయిర్‌పోర్టులను కూడా చేర్చనున్నట్టు వివరించాయి. ప్రైవేటు సంస్థల నుంచి ఆకర్షణీయమైన రేటు కోసమే ఇలా చేస్తున్నట్టు వెల్లడించాయి. త్వరలో విక్రయించబోయే విమానాశ్రయాల జాబితాలో అమృత్‌సర్, వారణాసి, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, తిరుచ్చి తదితర విమానాశ్రయాలు ఉండవచ్చని ఆ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక విమానాశ్రయాల ప్రైవేటీకరణలో భాగంగా రెండు దశల్లో లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి తదితర విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేశారు.
మిగిలిన వాటా విక్రయం
ఇప్పటికే ప్రైవేటుపరం చేసిన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మిగిలి ఉన్న స్వల్ప వాటాను కూడా విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఆయా ఎయిర్‌పోర్టుల్లో ఏఏఐకు ఉన్న ఈ వాటాను త్వరలో విక్రయించబోతున్నట్టు కేంద్ర సాధికార కమిటీకి చెందిన ఉన్నతాధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పౌరవిమానయాన శాఖ అధికారులు త్వరలో క్యాబినెట్ అనుమతులు తీసుకోబోతున్నట్టు వెల్లడించారు. 2.5 లక్షల కోట్ల నిధుల సేకరణే లక్ష్యంగా తీసుకొచ్చిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్‌ఎంపీ)లో భాగంగా దీన్ని అమలు చేస్తున్నట్టు వివరించారు. కాగా ముంబై విమానాశ్రయంలో ఏఏఐకి 26 శాతం వాటా, ఢిల్లీ విమానాశ్రయంలో ఏఏఐకి 26 శాతం వాటా, హైదరాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి ఏఏఐకి 26 శాతం వాటా, బెంగళూరు విమానాశ్రయంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి ఏఏఐకి 26 శాతం వాటా ఉన్నది.
392 వాయు మార్గాల్లో బిడ్డింగ్‌కు ఆహ్వానం
డొమెస్టిక్ ఎయిర్ కనెక్టివిటీని అభివృద్ధి చేయడంలో భాగంగా తీసుకొచ్చిన ఉడాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 392 వాయు మార్గాల్లో బిడ్డింగ్‌ను తెరిచేందుకు పౌర విమానయాన శాఖ సిద్ధమైంది. ఈ మేరకు విమానయాన సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఈ ప్రక్రియకు ఆరు వారాల సమయం పడుతుందని తెలిపింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ ప్రక్రియ చేపడుతున్నారు.
30 రోజుల్లో ఆలిండియా టూరిస్ట్ పర్మిట్
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించిన 30 రోజుల్లోగా ఆపరేటర్లకు ఆలిండియా టూరిస్ట్ పర్మిట్లు జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం టూరిస్ట్ వాహనాల ఆపరేటర్లు ఎవరైనా ఆలిండియా పర్మిట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నది.