పరీక్షకు ముందే వాట్సాప్‌లో ప్రత్యక్షమైన పదో తరగతి సోషల్‌ సైన్స్  ప్రశ్నపత్రం

పట్నా: బీహార్‌లో పదో తరగతి సోషల్‌ సైన్స్‌ పేపర్‌ లీకయ్యింది. పరీక్ష కంటే ముందే ప్రశ్నపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమయ్యింది. గుర్తించిన బోర్డు పరీక్షను రద్దు చేసింది. క్యాన్సలైన పరీక్షను మార్చి 8న నిర్వహిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో పదో తరగతి బోర్డ్‌ ఎగ్జామ్స్‌ గత బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నిన్న సోషల్‌ సైన్స్‌ పరీక్ష జరిగింది. మొదటి షిఫ్టులో భాగంగా 8,46,504 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే పరీక్ష కంటే ముందే ప్రశ్నపత్రం లీకైందని, వాట్సాప్‌లో విస్తృతంగా షేర్‌ అవుతుందని బీహార్‌ స్కూల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డ్‌ (బీఎస్‌ఈబీ) గుర్తించింది.

దీనిపైన విచారణ చేపట్టిన అధికారులు ఝాఝలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కాంట్రాక్ట్‌ ఉద్యోగులు దీనికి పాల్పడినట్లు వెల్లడించారు. వికాస్‌ కుమార్ అనే కాంట్రాక్ట్‌ ఉద్యోగి పరీక్ష పత్రాలను లీక్‌చేశాడని, వాటి ఫొటోలను వాట్సాప్‌లో పెట్టినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతనికి సహాయం చేసిన శక్తికాంత్‌ చౌదరి, అజిత్‌ కుమార్‌ అనే ఇద్దరు ఉద్యోగులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

మొదటి విడుతలో పరీక్ష రాసినవారికి మరోమారు ఎగ్జామ్‌ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పదోతరగతి బోర్డ్‌ ఎగ్జామ్స్‌కు 1.68 లక్షల మంది విద్యార్థులు తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇందులో 8,46,663 మంది బాలురు, 8,37,803 మంది బాలికలు ఉన్నారు.