రెండేళ్ల వయసులో ఓ పాపో, బాబో తప్పి పోతాడు. ఆ తర్వాత ఎప్పుడో ఎక్కడో యుక్త వయసు వచ్చిన తర్వాత అనూహ్యంగా దొరుకుతారు. అసలు బతికి ఉన్నారో లేదో తెలియని బిడ్డ దొరికినప్పుడు ఆ కుటుంబ సభ్యుల ఉద్వేగ క్షణాలు మాటలకు, రాతలకు అందవు. ఇలాంటి సీన్స్ సహజంగా మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ సినిమాను తలపించే ఫాతిమా అనే యువతి మిస్సింగ్ గురించి, కథ కాని ఆమె జీవిత కథ గురించి తెలుసుకుందాం.ఇది దాదాపు 16 ఏళ్ల క్రితం మాట. కర్నూలు జిల్లాకు చెందిన ఫాతిమాకు అప్పటికి రెండున్నరేళ్ల వయస్సు. ఫాతిమా కుటుంబం మక్కా మసీదు సందర్శన నిమిత్తం హైదరాబాద్ వెళ్లింది. తల్లిదండ్రులు మక్కా మసీదును సందర్శిస్తుండగా, రెండున్నరేళ్ల ఫాతిమా తప్పి పోయింది. అప్పట్లో ఇప్పుడు మాదిరిగా సీసీ కెమెరాల సౌకర్యం అంతగా లేని కాలం. దీంతో బిడ్డ ఆచూకీని కనుగొనడం అసాధ్యమైంది. బిడ్డ తప్పి పోవడాన్ని కొంత ఆలస్యంగా గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ కోసం లబోదిబోమన్నారు. అయినా ప్రయోజనం లేకపోయింది.దీంతో 16 ఏళ్లుగా ఫాతిమాను తలచుకోని క్షణమంటూ లేదు. నిత్యం బిడ్డ జ్ఞాపకాలతో అల్లాడిపోయేవారు. అసలు బిడ్డ బతికే ఉందా? ఉంటే ఎక్కడ? ఎలా ఉందో అనే బెంగ ఫాతిమా తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను నిత్యం వేధిస్తూ ఉండేది. తమ బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ఫాతిమా కుటుంబం ప్రతిరోజూ అల్లాను ప్రార్థించేది. చివరికి వారి ప్రార్థనలను అల్లా ఆలకించారు. చివరికి ఆ బిడ్డను తల్లిదండ్రుల వద్దకు చేర్చాడు.అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. 16 ఏళ్ల క్రితం ఫాతిమాగా తప్పి పోయిన బిడ్డ …ప్రస్తుతం స్వప్న పేరుతో దొరకడం విశేషం. రెండున్నరేళ్ల వయస్సులో తప్పి పోయిన ఫాతిమా … హైదరాబాద్‌లోని ఓ చిల్డ్రన్ హోంకు చేరింది. అక్కడ స్వప్న పేరుతో హిందువుగా పెరుగుతోంది. చదువు సంధ్యలూ అక్కడే. కాగా చిన్నప్పుడు లోకమంటే ఏంటో తెలియని వయసులో తప్పి పోయిన ఫాతిమా … ప్రస్తుతం తన కుటుంబ సభ్యులను గుర్తు పట్టలేక పోతోంది.ఫాతిమా అలియాస్ స్వప్న సోదరుడు అబిద్ హుస్సేన్ మాట్లాడుతూ … ఇది ఓ ఉద్వేగభరిత సన్నివేశమన్నాడు. ఈ క్షణా లను మాటల్లో చెప్పలేమన్నాడు. ఫాతిమాను తమ ఇంటికి తీసుకెళ్లి.. బంధువులు, స్నేహితులకు పరిచయం చేస్తామన్నాడు. ఆ తర్వాత ఆమెను తిరిగి హోంకు పంపిస్తామన్నాడు. ఇక్కడే చదువును కొనసాగిస్తుందని అతను చెప్పుకొచ్చాడు.
