వాట్సాప్ ఏం చెప్పింది?

న్యూఢిల్లీ: త‌మ కొత్త ప్రైవ‌సీ పాల‌సీ వ‌స్తున్న పుకార్ల‌కు చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేసింది ప్ర‌ముఖ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌. ఈ కొత్త పాల‌సీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న యూజ‌ర్లు చాలా మంది ఈ యాప్‌ను వ‌దిలి సిగ్న‌ల్‌, టెలిగ్రామ్‌లాంటి ప్ర‌త్యామ్నాయ యాప్‌ల వైపు వెళ్తున్నారు. దీంతో వెంట‌నే త‌మ కొత్త పాల‌సీపై వాట్సాప్ క్లారిటీ ఇచ్చింది. ప్రైవ‌సీ పాల‌సీలో చేసిన మార్పులు యూజ‌ర్లు త‌మ స్నేహితులు, కుటుంబ స‌భ్యుల‌కు పంపిన మెసేజ్‌ల ప్రైవ‌సీపై ఎలాంటి ప్ర‌భావం చూప‌వ‌ని వాట్సాప్ స్ప‌ష్టం చేసింది. వాట్సాప్‌లో బిజినెస్ మెసేజింగ్‌కు సంబంధించి మాత్రం ఈ అప్‌డేట్‌లో మార్పులు జ‌ర‌గ‌నున్న‌ట్లు చెప్పింది. ఇక ఫేస్‌బుక్‌తో తాము ఏ స‌మాచారం షేర్ చేసుకోబోమో కూడా వెల్ల‌డించింది.

వాట్సాప్ ఏం చెప్పింది?

– వాట్సాప్‌గానీ, ఫేస్‌బుక్‌గానీ మీ ప్రైవేట్ మెసేజ్‌లను చూడ‌టం కానీ, మీ కాల్స్ విన‌డం కానీ చేయ‌వు.

– ప్ర‌తి ఒక్క‌రు పంపే మెసేజ్‌లు, చేసే కాల్స్ లాగ్స్‌ను మాత్రం వాట్సాప్ అలాగే ఉంచుతుంది.

– వాట్సాప్‌గానీ, ఫేస్‌బుక్‌గానీ మీరు షేర్ చేసిన లొకేష‌న్‌ను చూడ‌వు.

– వాట్సాప్ మీ కాంటాక్ట్‌ల‌ను ఫేస్‌బుక్‌తో షేర్ చేయ‌దు.

– వాట్సాప్ గ్రూప్స్ కూడా ప్రైవేట్‌గానే ఉంటాయి.

– మీ మెసేజ్‌లు అదృశ్య‌మ‌య్యేలా సెట్ చేసుకోవ‌చ్చు.

– మీరు మీ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

ఇక గ్రూప్ ప్రైవ‌సీ గురించి చెబుతూ.. ఈ డేటాను యాడ్స్ కోసం ఫేస్‌బుక్‌తో పంచుకోము. ఈ ప్రైవేట్ చాట్స్ అన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌. అందువ‌ల్ల వాటిలో ఏముంటాయో మేము చూడ‌లేము అని స్ప‌ష్టం చేసింది.