టీచ‌ర్‌కు స్టూడెంట్ ఓదార్పు..

మ‌నిషి బాధ‌ను డ‌బ్బు, కార్లు, బంగ్లాలేవీ పోగొట్ట‌లేవు.. సాటి మ‌నిషి ఓదార్పు త‌ప్ప‌! క‌ష్ట స‌మ‌యంలో అండ‌గా నిల‌బ‌డి నేనున్నా అనే ధైర్యాన్ని క‌లిగించే ఒక్క మ‌నిషి ఒక‌రు ప‌క్క‌న ఉన్నా.. మ‌నసెంతో తేలిక‌ప‌డుతుంది. ఇలాంటి గొప్ప ఓదార్పు అమెరికాలోని ఒక టీచ‌ర్‌కు ద‌క్కింది. భ‌ర్త‌ను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న టీచ‌ర్‌.. బాధ‌ను పోగొట్టేందుకు ఓ స్టూడెంట్ రాసిన లేఖ‌ యావ‌త్ ప్ర‌పంచాన్ని ఆక‌ర్షిస్తోంది.

మ‌సాచుసెట్స్‌లోని ఓ పాఠ‌శాల‌కు చెందిన టీచ‌ర్ మెలిసా మిల్న‌ర్ భ‌ర్త‌.. అనారోగ్యం కార‌ణంగా మ‌ర‌ణించాడు. దీంతో ఆమె డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయింది. ఇది గ‌మ‌నించిన ఓ స్టూడెంట్‌.. త‌మ టీచ‌ర్ అలా బాధ‌గా ఉండ‌టం త‌ట్టుకోలేక‌పోయాడు. ఆమెను ఓదార్చేందుకు ఒక లెట‌ర్ రాశాడు. డియ‌ర్ మిసెస్ మిల్న‌ర్‌.. మీరు మీ భ‌ర్త‌ను కోల్పోవ‌డం చాలా బాధాక‌రం. మీ భ‌ర్త‌ను ఇక‌పై మీరు చూడ‌లేక‌పోవ‌చ్చు. కానీ ఎల్ల‌ప్పుడూ మీ హృద‌యాల‌ను క‌లిపే ఒక లైన్ ఉంటుంద‌ని గుర్తించండి. ఈ బాధ నుంచి త్వ‌ర‌గా కోలుకోండి అంటూ ఆ లేఖ‌లో రాశాడు. అంతేకాదు ఆ లేఖ‌లో ఒక డ్రాయింగ్ కూడా వేశాడు. ఆకాశంలో ఉన్న భ‌ర్త కోసం మిల్న‌ర్ చేతులు చాపుతున్న‌ట్లు డ్రాయింగ్ వేసి.. వారి ఇద్ద‌రి హృద‌యాల‌ను క‌లుపుతూ ఒక గీత గీశాడు.

స్టూడెంట్ రాసిన లేఖ‌తో ఆ టీచ‌ర్ ఎంతో ఎమోష‌న‌ల్ అయింది. త‌న‌పై స్టూడెంట్ చూపిన అభిమానాన్ని మిల్న‌ర్ ట్విట‌ర్ ద్వారా పంచుకుంది. ఆ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. స్టూడెంట్ రాసిన లెట‌ర్‌ను చ‌దివిన‌ నెటిజ‌న్లు కూడా భావోద్వేగానికి లోన‌వుతున్నారు.