వాషింగ్టన్: అమెరికా క్యాపిటల్ హిల్ భవనంలోకి దూసుకువెళ్లిన ట్రంప్ అభిమానులు తెగ హంగామా చేశారు. ఓ ట్రంప్ మద్దతుదారుడు ఏకంగా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆఫీసు రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న స్పీకర్ డెస్క్‌పై కూర్చుని.. దర్జాగా తన నిరసన తెలిపాడు. పెలోసీ చైర్‌లో కూర్చున్న నిరసనకారుడు.. తాము వెనక్కి వెళ్లేది లేదంటూ అక్కడ నుంచే తన మొబైల్‌లో మెసేజ్ కూడా చేశాడు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సేనేట్ సభలు ఉండే క్యాపిటల్ హిల్‌లోకి ట్రంప్ అభిమానులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కొందరు నిరసనకారులు బాడీ ఆర్మర్‌తో లోపలికి వచ్చినట్లు వాషింగ్టన్ మెట్రోపాలిటన్ పోలీసు చీఫ్ రాబర్ట్ కాంటీ తెలిపారు. పోలీసులపై దాడి చేసేందుకు ట్రంప్ అభిమానులు కెమికల్స్ వాడినట్లు కూడా అనుమానిస్తున్నారు. దేశాధ్యక్ష ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని వాళ్లు డిమాండ్ చేస్తూ ప్రో -ట్రంప్, అమెరికా జాతీయ జెండాలతో క్యాపిటల్ హిల్‌లో నినాదాలు చేశారు. ట్రంప్ మద్దతుదారులు ఎంత హంగామా చేసినా.. చివరకు యూఎస్ కాంగ్రెస్ బైడెన్ గెలుపును సర్టిఫై చేసింది. దీంతో అమెరికా 46వ దేశాధ్యక్షుడిగా బైడెన్ ఈనెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.