80 లక్షలకే డ్రీమ్‌ ఐలండ్‌

లండన్‌ : మెట్రో నగరాల్లోనే రూ 80 లక్షలకు లగ్జరీ అపార్ట్‌మెంట్లు అందుబాటులో లేని రోజుల్లో దాదాపు అదే మొత్తంతో స్కాట్లాండ్‌లో ఓ ద్వీపానికి యజమాని అయ్యే అవకాశం ముందుకొచ్చింది. ఈ ధరకు ఏకంగా ఓ ఐలాండ్‌ సొంతమవుతుందే ఎవరూ నమ్మరు. అయితే స్కాట్‌లాండ్‌లో స్ధలం కొనాలని కలలు కనేవారికి మాత్రం ఇది మెరుగైన అవకాశంగా చెబుతున్నారు. స్కాట్లాండ్‌ తీరంలో ఓ ప్రైవేట్‌ ద్వీపం రూ 80 లక్షలకే అమ్మకానికి పెట్టారు. స్కాట్లాండ్‌ పశ్చిమ తీరంలో 11 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ద్వీపాన్ని ఫ్యూచర్‌ ప్రాపర్టీ ఆక్షన్స్‌ వేలంలో ఉంచింది. డీర్‌ ఐలండ్‌గా పేరొందిన ఈ ద్వీపాన్ని ఎలియన్‌ యాన్‌ ఎఫెడ్‌గా కూడా పిలుస్తారు.

ప్రస్తుతం ఈ ద్వీపంలో ఎలాంటి ఇండ్లు, సౌకర్యాలు లేవని సమాచారం. ఎలాంటి ఆక్రమణలకు లోనవ్వని ఆహ్లాదకరమైన ప్రాంతాన్ని దక్కించుకునే వినూత్నం అవకాశం ఇదని ఫ్యూచర్‌ ప్రాపర్టీ ఆక్షన్స్‌ వెల్లడించింది. ఈ ద్వీపం పొరుగున ఉన్న మరో ఐలండ్‌ను బిలియనీర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌ సోదరి వెనెసా బ్రాన్సన్‌ సొంతం చేసుకున్నారు. మార్చి  26న జరిగే వేలంలో ప్రారంభ ధరగా ద్వీపం ఖరీదును  రూ 80 లక్షలుగా నిర్ధారించారు. ఈ ద్వీపానికి క్లాన్‌రనల్డ్‌ గతంలో యజమాని కాగా, ప్రస్తుత యజమాని వివరాలు వెల్లడికాలేదు.