చైనా వ్యాక్సిన్‌కు పాక్ గ్రీన్ సిగ్న‌ల్

ఇస్లామాబాద్‌: చైనాకు చెందిన సినోఫార్మ్ కొవిడ్ వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి డ్ర‌గ్ రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ పాకిస్థాన్‌ సోమ‌వారం ఆమోదం తెలిపింది. పాక్ ఆమోదించిన రెండో క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ ఇది. గ‌త శుక్ర‌వారం ఆ దేశం ఆక్స్‌ఫ‌ర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ రెండు వ్యాక్సిన్ల సామ‌ర్థ్యాన్ని ప‌రిశీలించిన త‌ర్వాత వీటికి అనుమ‌తి ఇచ్చిన‌ట్లు రెగ్యులేట‌రీ బోర్డు ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ప్ర‌తి మూడు నెల‌ల‌కోసారి ఈ వ్యాక్సిన్ల భ‌ద్ర‌త‌, సామ‌ర్థ్యం, ప్ర‌భావంపై సమీక్ష జ‌రుపుతామ‌ని తెలిపింది. సినోఫార్మ్‌ను బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ‌యోలాజిక‌ల్ ప్రోడ‌క్ట్స్ అభివృద్ధి చేసింది. త‌మ వ్యాక్సిన్ సామ‌ర్థ్యాన్ని 79.3 శాతంగా ఆ కంపెనీ చెబుతోంది. పాకిస్థాన్ కాకుండా సినోఫార్మ్ వ్యాక్సిన్ వినియోగానికి యూఏఈ, బ‌హ్రెయిన్ కూడా అనుమ‌తించాయి.