బైడెన్ ప్రమాణానికి ఎంతమంది హాజరవుతున్నారో తెలుసా?

వాషింగ్ట‌న్‌:  అమెరికా దేశాధ్య‌క్షుడిగా జోసెఫ్‌ బైడెన్ ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. అయితే అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉదృతంగా ఉన్న విష‌యం తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో క్యాపిట‌ల్ హిల్‌లో జ‌రిగే ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ప‌లు ఆంక్ష‌లు విధించారు.  వ్య‌క్తిగ‌తంగా ఆ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యే వారి సంఖ్య‌ను కుదించారు.  వ్య‌క్తిగ‌తంగా ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ప్ర‌జ‌లెవ‌రూ రావ‌ద్దు అని ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.  లైవ్‌లోనే ఆ కార్య‌క్ర‌మాన్ని వీక్షించాల‌ని కోరింది.  స్టాండ్స్ నుంచి ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మాన్ని వీక్షించే విధానాన్ని ర‌ద్దు చేశారు.  డిన్న‌ర్లు, బాల్ రూమ్ ఈవెంట్ల‌ను కూడా ర‌ద్దు చేశారు. నిజానికి ఉభ‌య‌స‌భ‌ల‌కు చెందిన ఆఫీసులు ఉచితంగానే ఈ ఈవెంట్ కోసం టికెట్ల‌ను పంచుతాయి. కానీ ఈసారి ఆ వ్య‌వ‌స్థ‌ను నిలిపేశారు. ప్ర‌తిసారి దాదాపు రెండు లక్ష‌ల మందికి  ఉచితంగా టికెట్లు ఇస్తారు.  ఈసారి మాత్రం ఆహ్వానితుల సంఖ్య‌ను త‌గ్గించారు.  ఉచిత టికెట్ల‌ను ఇవ్వ‌డంలేదు. కేవ‌లం ప్ర‌తి ప్ర‌జాప్ర‌తినిధితో ఓ అతిథికి ఆహ్వానం క‌ల్పించారు.  దీని వ‌ల్ల ఆ ప్ర‌తినిధికి చెందిన నియోజ‌క‌వ‌ర్గం వారికి ఈసారి ఉచిత ఆహ్వాన టికెట్లు లేన‌ట్లే.  బైడెన్ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి వ్య‌క్తిగ‌తంగా సుమారు రెండు వేల మంది హాజ‌ర‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.  దాంట్లోనే 200 మంది వీఐపీలు ఉండ‌నున్నారు. అధ్య‌క్ష‌, ఉపాధ్య‌క్ష కుటుంబాలు హాజ‌రుకానున్నాయి. 2009లో బ‌రాక్ ఒబామా ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి సుమారు అయిదు ల‌క్ష‌ల మంది ప్ర‌త్య‌క్షంగా హాజ‌ర‌య్యారు.  ఈసారి కూడా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా, జార్జ్ బుష్‌, బిల్ క్లింట‌న్ త‌మ‌త‌మ స‌తీమ‌ణుల‌తో హాజ‌రుకానున్నారు. వాష్టింగ‌న్‌లో దాదాపు 25 వేల మంది నేష‌న‌ల్ గార్డు పోలీసులు ప‌హారా కాస్తున్నారు.  గ‌త ఈవెంట్ల‌తో పోలిస్తే ఈ సంఖ్య రెండున్నర రేట్లు ఎక్కువ‌. సెల‌బ్రిటీలు జెన్నిఫ‌ర్ లోపేజ్‌, లేడీ గాగాలు .. బైడెన్ ఈవెంట్‌లో ప‌ర్ఫార్మ్ చేయ‌నున్నారు.  భ‌ద్ర‌త‌కు రానున్న 25 వేల మంది నేష‌న‌ల్ గార్డ్స్‌ను ఎఫ్‌బీఐ సున్నితంగా ప‌రిశీలిస్తున్న‌ది.  ఇన్‌సైడ్ అటాక్ జ‌రిగే ప్ర‌మాదం ఉన్న నేప‌థ్యంలో ఈ చెకింగ్ నిర్వ‌హిస్తున్నారు.