చరిత్రలో ఈరోజు

నాసా స్పేస్ మిషన్ యాన్ కొలంబియా స్పేస్ షటిల్ ఎస్‌టీఎస్‌-107 అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి వాహనం ఇది. 1981 ఏప్రిల్ నెలలో తొలిసారి ప్రయాణించింది. తరువాత ఇది 27 వేర్వేరు మిషన్లను పూర్తి చేసింది. అయితే, 2003 జనవరి 16న, వాహనం యొక్క 28 వ ప్రయాణం చివరిదని ఎవరూ అనుకోలేదు. 16 రోజుల మిషన్ పూర్తి చేసిన తరువాత 2003 ఫిబ్రవరి 1 న భూమికి తిరిగి వస్తుండగా పేలిపోయింది. ఈ దుర్ఘటనలో భారత వ్యోమగామి కల్పనా చావ్లా అసువులు బాసారు. ఇదే వాహనంలో ఉన్న మరో ఆరుగురు వ్యోమగాములు కూడా మరణించారు.

భారతదేశం- పాకిస్తాన్ విభజన సమయంలో ముల్తాన్ నుంచి కర్నాల్‌కు వలస వచ్చిన బనారసి లాల్ చావ్లా నలుగురు పిల్లలలో కల్పన చిన్నది. ఇంట్లో ఆమెను ఆప్యాయంగా మోంటో అని పిలిచేవారు. 1962 మార్చి 17 న జన్మించిన కల్పనా చావ్లా.. ప్రారంభంలో కర్నాల్‌లో పాఠశాల విద్య పూర్తిచేసింది. అనంతరం పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి బీటెక్ పూర్తిచేసింది. అమెరికా వెళ్లి ఏరోస్పేస్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం పరిశోధనలో నిమగ్నమైంది. అందమైన భవిష్యత్ కోసం కలలు కంటూ గాలిలో మేడలు కట్టకుండా జీవిత లక్ష్యాన్ని సాధించుకున్న మహిళ కల్పనా చావ్లా. చదువులో ఎప్పుడూ ముందు ఉండేది.

కల్పనా చావ్లాకు 1991 లో అమెరికా పౌరసత్వం లభించింది. ఈమె నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసినపుడు ఈమెతోపాటు 2 వేల మంది పోటీ పడ్డారు. అయితే ఈమె మాత్రమే నాసా శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. 1997 లో ఆమె నాసా స్పెషల్ షటిల్ ప్రోగ్రాంలో అంతరిక్షంలోకి వెళ్ళడానికి ఎంపికైంది. మొదటి అంతరిక్ష మిషన్ 1997 నవంబర్ 19 న ప్రారంభమైంది. ఆ సమయంలో కల్పన వయసు 35 సంవత్సరాలు. కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడీమే 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్ళు అంతరిక్ష యానం చేశారు. 2003, జనవరి 16 న రెండోసారి అంతరిక్షం లోకి వెళ్ళే ముందు కల్పనా చావ్లా మీడియాతో మాట్లాడారు. “భారతదేశంలో మొట్టమొదటి విమానాన్ని నడిపిన జేఆర్‌డీ టాటాయే నాకు స్ఫూర్తి, అందుకనే ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ ను కెరీర్‌గా తీసుకున్నా” అని చెప్పారు. భారత మహిళలకు మీరిచ్చే సందేశమేమిటని అడిగితే.. “ఏదో ఒకటి చేయండి. కానీ, దాన్ని మీరు మనస్ఫుర్తిగా చేయాలనుకోవాలి. ఎందుకంటే ఏదైనా పనిని కేవలం ఒక లక్ష్యం కోసం చేయడం కాక, దానిలో లీనమై అనుభవించాలి. అలా అనుభవించలేని వారు తమకు తాము వంచించుకున్నాట్లే” అని చెప్పారు. 2003 సంవత్సరం కల్పనా చావ్లకు చివరి అంతరిక్ష యాత్ర అని ఎవరూ అనుకోలేదు.  ఆమె 1983 లో విమానయాన శిక్షకుడు , విమాన చోదక శాస్త్ర రచయిత ఐన జీన్-పియర్ హారిసన్ ను వివాహం చేసుకున్నారు. న్యూయార్క్ సిటీలోని క్వీన్స్ ప్రాంతంలోని 74 జాక్సన్ హైట్స్ వీధికి ఆమె గౌరవార్ధం 74 వ కల్పనా చావ్లా వీధి అనిపేరు పెట్టారు.

మరికొన్ని ముఖ్య సంఘటనలు :

2013: సిరియాలోని ఇడ్లిబ్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో 24 మంది మరణించారు.

2009: ఉత్తరప్రదేశ్‌ను ఓడించి ముంబై జట్టు 38 వ సారి రంజీ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.

1989: సోవియట్ యూనియన్ అంగారక గ్రహానికి రెండు సంవత్సరాల మనుషుల మిషన్ కోసం తన ప్రణాళికను ప్రకటించింది.

1989: మలయాళ నటుడు ప్రేమ్ నజీర్ కన్నుమూశారు.

1920: ‘లీగ్ ఆఫ్ నేషన్స్’ మొదటి కౌన్సిల్ సమావేశాన్ని పారిస్‌లో నిర్వహించింది.

1769: కోల్‌కతాలోని అక్రలో మొదటిసారి ప్రణాళికాబద్ధమైన గుర్రపు పందెం నిర్వహించారు.

1761: పుదుచ్చేరిని ఫ్రెంచ్ ఆక్రమణ నుంచి బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు.

1681: చత్రపతి శివాజీ కుమారుడు శంభాజీకి పట్టాభిషేకం మహారాష్ట్రలోని రాయ్‌గడ్ కోటలో జరిగింది.

1581: బ్రిటన్ పార్లమెంటు రోమన్ కాథలిక్ క్రైస్తవులపై చట్టాన్ని ఆమోదించింది.