బీజింగ్: చైనా టెక్ ఐకాన్ జాక్ మాకు ఆ దేశం మరో షాకిచ్చింది. అసలు చైనాలో ఇంటర్నెట్ అంటే పెద్దగా తెలియని రోజుల్లోనే అలీబాబా గ్రూప్‌ను స్థాపించి దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగిన జాక్ మాను.. ఇప్పుడో టెక్ ప్రముఖుడిగా గుర్తించడానికి కూడా చైనా అంగీకరించడం లేదు. తాజాగా అక్కడి అధికార మీడియా మంగళవారం దేశానికి మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్న టెక్ దిగ్గజాల గురించి ప్రత్యేకంగా ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఇందులో జాక్ మా ఊసే లేకపోవడం గమనార్హం. అదే సమయంలో ఆయన ప్రత్యర్థి అయిన పోనీ ఎం పేరును ప్రత్యేకంగా ప్రస్తావించింది. మొబైల్ రంగ చరిత్రనే తిరగరాస్తున్న వ్యక్తిగా పోనీ ఎంపై ప్రశంసలు కురిపించింది. ఆయనతోపాటు బీవైడీ సంస్థ చైర్మన్ వాంగ్ చువాన్‌ఫు, షియోమీ కో ఫౌండర్ లీ జున్, హువావీ టెక్నాలజీస్‌కు చెందిన రెన్ జెంగ్‌ఫెయ్‌ల పేర్లను కూడా చైనా అధికార మీడియా ప్రత్యేకంగా ప్రస్తావించింది.
జాక్ మాకు ఎందుకీ పరిస్థితి?
చైనా నియంత్రణ సంస్థలపై గతేడాది అక్టోబర్‌లో జాక్ మా చేసిన వ్యాఖ్యలతో ఆ దేశం ఈ కుబేకుడిని పక్కన పెట్టేసింది. ఆ తర్వాత రెండు నెలల పాటు అసలు ఆయన కనిపించకుండా పోయారు. చైనా బ్యాంకింగ్ వ్యవస్థ గురించి జాక్ మా చేసిన విమర్శలు.. జిన్‌పిన్ ప్రభుత్వం ఆగ్రహానికి దారితీశాయి. ఆర్థిక వ్యవస్థలో లోపాలున్నాయని, బ్యాంకులు బంట్లుగా వ్యవహరిస్తున్నాయని జాక్ మా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటున్నవారికి ఎటువంటి భయాలుండటం లేదని, వ్యవస్థ ఒక రకంగా అవినీతిమయమైపోయిందన్నారు. దీంతో చైనా సర్కారు వెంటనే ఆన్‌లైన్ సూక్ష్మ రుణాలపై నిబంధనలను కఠినతరం చేసేసింది. ఈ రంగంలోని సంస్థల వ్యాపార విధానం, మూలధనం ఇతరత్రా అంశాల మార్గదర్శకాలను సవరించేసింది. ఇవి జాక్ మాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్‌పై ఒత్తిడిని పెంచగా, కొత్త నిబంధనలకు లోబడి సంస్థ లేదంటూ యాంట్ గ్రూప్ 37 బిలియన్ డాలర్ల ఐపీవోను రెగ్యులేటర్లు అడ్డుకున్నారు. ఇప్పటికే చైనాతో వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికాలో యాంట్ ఐపీవో లేకుండా పోయింది. ఇప్పుడు స్వదేశంలోనూ ఆగిపోగా.. ఒక్కసారిగా జాక్ మాను లక్షల కోట్ల నష్టాలు వెంటాడుతున్నాయి. మొత్తానికి తమ పాలననే వ్యతిరేకించిన జాక్ మాను జిన్‌పిన్ సర్కారు పెద్ద దెబ్బే కొట్టింది.