గోద్రా మారనహోమానికి 19 ఏండ్లు

2002 ఫిబ్రవరి 27.. భారత చరిత్రలో అతి విషాదమైన రోజు. గుజరాత్‌ రాష్ట్రంలోని గోద్రా రైల్వే స్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఎస్-6 కోచ్‌కు దుండగులు నిప్పంటించడంతో 59 మంది దుర్మరణం పాలయ్యారు. వీరంతా అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కర సేవకులు. ఈ మత ఉద్రిక్తత గుజరాత్‌ అంతటా వ్యాపించింది. గోద్రాలోని పాఠశాల, దుకాణాలన్నీ మూసివేసి కర్ఫ్యూ విధించారు. ఆ సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

గోద్రా మారణహోమం అనంతరం గుజరాత్ అంతటా అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులతోపాటు మొత్తం 1,044 మంది చనిపోయారు. గోద్రా మారణహోమం జరిగిన మరుసటి రోజు అహ్మదాబాద్ గుల్బర్గ్ హౌసింగ్ సొసైటీలో 69 మందిని గుర్తుతెలియని వ్యక్తులు గుంపుగా వచ్చి చంపి పారిపోయారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ కూడా ఉన్నారు. మూడవ రోజు నుంచి రాష్ట్రంలో సైన్యాన్ని మోహరించారు. రాష్ట్రంలో అల్లర్లను నిలువరించేందుకు మోదీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పలు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నరేంద్ర మోదీని కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. గోద్రా సంఘటనపై దర్యాప్తు చేయడానికి మోదీ ప్రభుత్వం

2002 మార్చి 6 న  నానవతి-షా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కేజీషా, సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జీటీ నానావతి దాని సభ్యులుగా ఉన్నారు. కమిషన్ తన నివేదిక మొదటి భాగాన్ని 2008 సెప్టెంబర్ నెలలో సమర్పించింది. గోద్రా సంఘటనను ప్రణాళికాబద్ధమైన కుట్రగా అభివర్ణించిన కమిషన్‌.. నరేంద్ర మోదీ, ఆయన మంత్రులు, ఉన్నతాధికారులకు క్లీన్ చిట్ ఇచ్చింది. జస్టిస్ కేజీ షా 2009 లో మరణించడంతో గుజరాత్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అక్షయ్ మెహతా సభ్యుడిగా వచ్చారు. ఈ కమిషన్‌ తన నివేదిక రెండవ భాగాన్ని 2019 డిసెంబర్‌లో అందజేసింది. ఈ భాగంలో కూడా పాత విషయాలనే పునరావృతం చేశారు.

దోషులుగా 31 మంది నిర్ధారణ

గోద్రా మారణహోమంలో 31 మంది ముస్లింలను దోషులుగా నిర్ధారించారు. 2011 లో సిట్ కోర్టు 11 మంది దోషులకు మరణశిక్ష.. మరో 20 మందికి జీవిత ఖైదు విధించింది. తరువాత 2017 అక్టోబర్‌లో గుజరాత్ హైకోర్టు 11 మంది దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది.

మరికొన్ని ముఖ్య సంఘటనలు:

2010: 8 వ కామన్వెల్త్ షూటింగ్ పోటీలో 35 బంగారు, 25 రజత, 14 కాంస్యాలుతో మొత్తం 74 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచిన భారత్‌

2010: ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు, భారతరత్న నానాజీ దేశ్ముఖ్ మరణం

2004: ఫిలిప్పీన్స్‌లో ఉగ్రవాదుల బాంబు దాడి ఘటనలో 116 మంది దుర్మరణం

1999: పౌర పాలకుడిని ఎన్నుకోవటానికి 15 సంవత్సరాలలో తొలిసారి నైజీరియాలో ఓటింగ్

1956: లోక్‌సభ మొదటి స్పీకర్ జీవీ మావళంకర్ కన్నుమూత

1951: అమెరికా రాజ్యాంగంలో 22 వ సవరణ.. ఏ వ్యక్తైనా రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్షుడుగా ఎన్నుకునే వీలు

1931: అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్ పార్క్‌లో బ్రిటిష్ పోలీసుల కాల్పుల సందర్భంగా తనకు తాను కాల్చుకున్న చంద్రశేఖర్ ఆజాద్