విటమిన్‌ సీ సప్లిమెంట్లతో ప్రమాదం

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్లు చిన్న మొత్తంలో అవసరం. విటమిన్ సీ ని ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా అంటారు. ఇది మానవ శరీరం ద్వారా ఉత్పత్తి కాదు. కేవలం ఆహారం ద్వారానే పొందవచ్చు. శరీరంలో వివిధ కణజాలాల ఆరోగ్య, మరమ్మతు కోసం అవసరమైన కొల్లాజెన్ తయారుకు విటమిన్‌ సీ అత్యవసరం. దీని లోపం కారణంగా అలసట, బలహీనత, కండరాలనొప్పులు, చర్మంపైచిన్న, ఎరుపు నీలం గాయాలుగా కనిపించే స్పాట్స్, పొడిబారిన చర్మం, చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుంచి ఆకస్మిక, ఊహించని రక్తస్రావం, కీళ్ళులోకి రక్తస్రావం, ఎముకలలోమార్పులు, దంతనష్టం, బరువునష్టం వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. విటమిన్‌ సీ లోపం కారణంగా క్యాన్సర్‌, ఆస్తమా, కార్డియో వాస్క్యులార్‌ సమస్యలు, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, జట్టు పలచగా మారడం, స్కర్వీ వంటి ప్రమాదకర వ్యాధులకు గురవుతాం. ఫ్రీ రాడికల్స్ అని పిలువబడే హానికరమైన అణువుల వలన కలిగే నష్టం నుంచి రక్షించగల అనేక యాంటీఆక్సిడెంట్లలో విటమిన్ సీ ఒకటి. అలాగే, శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో, సిగరెట్ పొగ వంటి కాలుష్య కారకాలను తొలగించడంలో సీ విటమిన్‌ ఎంతగానో దోహదం చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి ఆరోగ్య పరిస్థితుల అభివృద్ధికి దోహదం చేస్తాయి. విటమిన్ సీ లోపమనేది ఒకరకంగా అనారోగ్యకర జీవనశైలికి నిదర్శనమని, ఇది పక్షవాతం ముప్పును పెంచుతుందనీ వైద్యనిపుణులు గుర్తుచేస్తున్నారు.

ఎంత మోతాదులో తీసుకోవాలి..?

విటమిన్ సీ పొందేందుకు ఉత్తమమైన మూలాలు స్థానికంగా సేంద్రీయంగా పండించే పండ్లు, కూరగాయలు. కొన్ని తృణధాన్యాలు, ఇతర ఆహార పానీయాల్లో సీ విటమిన్‌ దొరుకుతుంది. శిశువులకు నిత్యం 40-50 మిల్లీగ్రాముల మధ్య, పిల్లలకు 15 నుంచి 45 మిల్లీగ్రాములు, యువతకు 75-90 గ్రాములు, పెద్దలకు నిత్యం 95 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ సీ విటమిన్‌ కావాల్సి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం ద్వారా సీ విటమిన్‌ ఏమాత్రం అందనిపక్షంలో సప్లిమెంట్ల రూపంలో శరీరానికి అందించాలి. ఇలా చేయడం  వల్ల శరీరం నిర్ణీత విధానంలో పనిచేయడం మానేసి సప్లిమెంట్లకు అలవాటుపడుతుందని నిపుణులు చెప్తున్నారు.

వందల కోట్ల వ్యాపారం

గత వందేళ్లలో ప్రపంచం చాలా మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో కూర్చుండి శరీరానికి సీ విటమిన్‌ అందించే ఆహారాలను తీసుకోవడం మరిచిపోతున్నాం. ఫలితంగా ఎన్నో వ్యాధులకు గురవుతున్నాం. ఆహారాల నుంచి సీ విటమిన్‌ అందకపోతే ఏంటి..? సప్లిమెంట్ల ద్వారా పొందవచ్చుననని చాలా మంది భావిస్తున్నారు. ఆ విధంగా తమ మెనూను సిద్ధం చేసుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలు బయటపడిన సందర్భాల్లో వైద్యుల సూచనల మేరకు సప్లిమెంట్లు తీసుకుంటున్నారు. ఫలితంగా మరింత ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ఫలితంగా విటమిన్‌ ట్యాబ్లెట్ల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లకు చేరుకున్నది.

ప్రతి విటమిన్, మరో దానికంటే భిన్నంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం కోసం వాటిని తగిన మోతాదులో తీసుకోవడం చాలా అవసరం. వీటిలో విటమిన్ డీ ఒక్కటే మన శరీరానికి సూర్యరశ్మి నుంచి అందుతుండగా.. మిగతా విటమిన్లు ఆహారం నుంచే లభిస్తాయి. తాత్కాలిక ప్రయోజనం ఉంటుందని చాలామంది విటమిన్ టాబ్లెట్లు మింగుతున్నారు. కానీ, క్రమం తప్పకుండా సమతులాహారం తీసుకుంటే, అవి శరీరానికి అవసరమైన విటమిన్లు అందిస్తాయనే విషయాన్ని మర్చిపోతున్నారు. నారింజ, బత్తాయి, బొప్పాయి, స్ట్రాబెర్రీ, జామ, క్యాప్సికం, మిరపకాయలు, గోబీపువ్వు, ఆకుకూరల వంటి పండ్లు, కూరగాయల్లో విటమిన్ సీ దండిగా ఉంటుంది.

రోజుకు రెండు నారింజ లేదా రెండు నిమ్మకాయలు తీసుకుంటుంటే శరీరంలో ఒక రోజు సీ విటమిన్‌కు సరిపోతుంది. కానీ విటమిన్-సీ సప్లిమెంట్ ఎంత ఉందో మీకు తెలుసా? టాబ్లెట్, పౌడర్ రూపంలో లభించే విటమిన్-సీ సప్లిమెంట్స్ నిత్యం తీసుకోవడం ఆపేయాలి. విటమిన్ సీ ట్యాబ్లెట్లు, పౌదర్‌ తయారీలో ఉపయోగించే వివిధ రసాయనాలు మనకు మంచి కన్నా చెడే ఎక్కువ చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి మన మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని మరిచిపోవద్దు. విటమిన్-సీ ని సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే ఎక్కువ హానికరం అని మరిచిపోవద్దు.