త‌్రిఫ‌ల చూర్ణం…మోతాదుకు మించితే అన‌ర్థం

హైద‌రాబాద్‌: త‌్రిఫ‌ల చూర్ణం! ఆయుర్వేదంలో దీన్ని సర్వరోగ నివారిణిగా పిలుస్తారు. ఉసిరి కాయ‌, కరక్కాయ, తానికాయ అనే మూడు ర‌కాల చెట్ల నుంచి వ‌చ్చే ఫ‌లాల మిశ్ర‌మం కాబ‌ట్టి దీనికి త్రిఫ‌ల చూర్ణం అనే పేరు వ‌చ్చింది. ఇది ప్రకృతి సిద్ధమైన యాంటీ బయాటిక్. ఒక వ్యక్తి ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నాడంటే అత‌నిలో వాత, పిత్త, కఫ అనే మూడింటిలో ఏదో ఒక సమస్య ఉంద‌ని అర్థం. మ‌రి ఆ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలంటే శరీరం లోపలి మలినాలను శుభ్రం చేయాలి. శ‌రీరం లోప‌లి వ్యర్థాల‌ను విస‌ర్జితం కావ‌డంలో త్రిఫల చూర్ణం అద్భుతంగా పనిచేస్తుంది.ఈ త్రిఫల చూర్ణాన్నే నిత్య రసాయనంగా పిలుస్తారు. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరికాయలో విటమిన్‌-సి అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల ఉసిరికి రోగ‌నిరోధ‌క శ‌క్తిని, జీర్ణశక్తిని పెంచే గుణాలన్నీ ఉంటాయి. ఇక‌ కరక్కాయ, తానికాయ కషాయ రస ప్రధానమైనవి. ఆ రెండింటితోపాటు ఉసిరిని క‌లిపి తీసుకుంటే ఎంత‌టి జీర్ణ సంబంధ స‌మ‌స్య అయినా వెంటనే తొల‌గిపోతుంది. అంతేగాక నోటి పొక్కులు, మలబద్ధ్దకం, అసిడిటీలకు కూడా త్రిఫల చూర్ణం బాగా పనిచేస్తుంది. కడుపుబ్బరం, గ్యాస్‌ సమస్యలకు  విరుగుడుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. జీర్ణశక్తిని వృద్ధి చేయడంతోపాటు వాతాన్ని కిందికి వెళ్లేటట్టు చేస్తుంది. అందువల్ల పేగుల కదలికలు బాగుంటాయి. అదేవిధంగా చర్మ సంబంధ‌ వ్యాధులు ఉన్నవారికి ఇది దివ్య ఔషధంగా ప‌నికొస్తుంది. త్రిఫల చూర్ణాన్ని వాడేవారిలో ముఖం, శరీరం రంగు ప్ర‌కాశవంతంగా మారుతుంది. ఎలాంటి మచ్చలున్నా తొల‌గిపోతాయి.ఇక‌, త్రిఫల చూర్ణంలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు ఎదుగుదలను ప్రేరేపిస్తాయి. జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. తెల్లజుట్టు స‌మ‌స్య‌ను కూడా తగ్గిస్తుంది. కాలుష్యం కారణంగా పాడ‌య్యే శిరోజాలకు త్రిఫ‌ల చూర్ణం జీవం పోస్తుంది. ఈ చూర్ణాన్ని క్రమం త‌ప్ప‌కుండా వాడే వారిలో ఊభ‌కాయ స‌మ‌స్య కూడా త‌గ్గిపోతుంద‌ని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది.మధుమేహంతో బాధ‌ప‌డుతున్న వారికి కూడా త్రిఫ‌ల చూర్ణం ఎంతో మేలు చేస్తుంది. శ‌రీరంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో  ఉంచుతుంది. అలాగే క్యాన్సర్ కారకాలతో పోరాడే శక్తి కూడా త్రిఫ‌ల చూర్ణానికి ఉంది. త్రిఫల చూర్ణం చాలా శక్తిమంతమైనది.శరీరంపై త్రిఫ‌ల చూర్ణం ప్రభావం చాలా బలంగా ఉంటుంది. అందుకే దీన్ని స‌రైన మోతాదులో తీసుకోక‌పోతే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వ‌స్తాయి. మోతాదు ఎక్కువైతే విరేచనాలు, అతిసారం బారినప‌డే ప్ర‌మాదం ఉంది. బలహీనంగా ఉండేవారు, శరీరం పొడిగా ఉండేవారు, గర్భణీ స్త్రీలు త్రిఫ‌ల చూర్ణాన్ని తీసుకోకపోవడం ఉత్త‌మం. కంటి సంబంధ స‌మ‌స్య‌లు ఉన్నవారికి కూడా త్రిఫ‌ల చూర్ణంతో ప‌రిష్కారం ల‌భిస్తుంది. అయితే, ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోరాదు. గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ చూర్ణాన్ని కలిపి రాత్రి పడుకోబోయే ముందు మాత్రమే తీసుకోవాలి. ఇతర అనారోగ్య సమస్యలకు వాడాలనుకునేవారు వైద్యుల సలహా తీసుకోవాలి. త్రిఫల చూర్ణాన్ని దీర్ఘకాలం వాడటం మంచిది కాదు. శరీరానికి అలవాటు పడిపోయే ప్రమాదం ఉంది.