రోజు స్నానం చేస్తున్నారా? ఐతే ఇది చదవాల్సిందే

అసలే చలికాలం. దానికితోడు ఎక్కువమంది వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్ లో ఉన్నారు. ఇల్లు కదలడం లేదు. ఈ నేపథ్యంలో చాలామంది రోజూ స్నానం చేయడం మానేశారు. ఒకప్పుడు పద్ధతి ప్రకారం పొద్దున్నే స్నానం చేసిన వాళ్లు కూడా ఇప్పుడు బద్ధకిస్తున్నారు. గుర్తొచ్చినప్పుడు లేదా రోజు తప్పించి రోజు స్నానం చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే ఆసక్తికర చర్చ మొదలైంది.అసలు రోజూ స్నానం చేయాలా? 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తే తప్పేంటి? వారానికి ఒకసారే తలస్నానం చేస్తే తప్పేంటి లాంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ప్రముఖ డెర్మటాలజిస్టులు (చర్మవ్యాధి నిపుణులు) దీనిపై వివరణ ఇస్తున్నారు. అందరూ ముక్తకంఠంతో చెప్పేది ఒకటే. రోజూ స్నానం చేయాల్సిందే.రోజూ స్నానం చేయడాన్ని కేవలం శుభ్రత కోణంలో మాత్రమే చూడొద్దంటున్నారు డెర్మటాలజిస్టులు. రోజూ స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలిగిపోవడంతో పాటు శరీరానికి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్ లో ఉన్న ఉద్యోగులు.. కచ్చితంగా రోజూ స్నానం చేయాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, కండరాలు రిలాక్స్ అవుతాయని.. అప్పుడు బుర్ర మరింత బాగా పనిచేస్తుందని అంటున్నారు.అయితే చలికాలం స్నానం చేయడం వల్ల డ్రై స్కిన్ ఉండేవాళ్లు ఎక్కువగా బాధపడుతుంటారు. ఇలాంటి వాళ్లకు కొన్ని సూచనలు కూడా అందిస్తున్నారు వైద్యులు. డ్రై స్కిన్ ఉండేవాళ్లు చలికాలం స్నానాన్ని తొందరగా పూర్తిచేయాలంట. ఆ వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి చెబుతున్నారు. మరి తొందరగా స్నానం ముగిస్తే శరీరం శుభ్రపడుతుందా..? అందుకే ఇలాంటి వాళ్లు రోజుకు 2 సార్లు వేగంగా స్నానం చేయాలని సూచిస్తున్నారు.ఇక తలస్నానం విషయానికొస్తే ఎక్కువమంది వారానికి ఒకసారి మాత్రమే చేస్తారు. కానీ 3 రోజులకు ఒకసారి తలస్నానం చేయడం చాలా మంచిదంటున్నారు నిపుణులు. మొత్తమ్మీద కాలం ఏదైనా, మనం ఏ పనిలో ఉన్నా.. రోజూ ఓ టైమ్ కు రెగ్యులర్ గా స్నానం చేయడం అన్ని విధాలుగా ఉత్తమం అంటున్నారు.వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లు పొద్దున్నే స్నానం చేయడానికి బద్ధకిస్తే.. కనీసం పడుకునే ముందైనా స్నానం చేయాలని సూచిస్తున్నారు. ఎటొచ్చి రోజూ స్నానం చేయడం మాత్రం మస్ట్.