కవిత్వ చికిత్స…
  1. మనిషి ఆరోగ్యంలో అపసవ్యతలు ఏర్పడినప్పుడు, వ్యాధులు, రోగాలు వస్తాయి. ఈ రోగాలను నయం చేయడం కోసం ఇప్పటి వరకు మనకు ఎన్నెన్నో రకాల చికిత్సా విధానాలు ఆచరణలోకి వచ్చాయి. వాటన్నిటిలో ప్రస్తుతం అల్లోపతి విధానం అత్యంత ప్రచారం పొందగా, ఆయుర్వేదం, యోగ, యునాని, సిద్ధ, టిబెటన్ వైద్యం, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెజర్ , హోమియోపతి వంటివి ప్రత్యామ్నాయ వైద్య చికిత్సలుగా వ్యాప్తిలో ఉన్నాయి. కాగా, ఇటీవలి కాలంలో మరికొన్ని చికిత్సా విధానాలు జన బాహుళ్యంలో ఆదరణ చూరగొంటున్నాయి. వాటిలో కళా చికిత్స, సంగీత చికిత్స, నృత్య చికిత్స, సినిమా థెరపీ, డ్రామా థెరపీలతో పాటు, అక్షరం కూడా అనారోగ్యాన్ని నయం చేస్తుందని నిరూపిస్తున్న “కావ్య చికిత్స ” కూడా ప్రముఖంగా ఉంటున్నాయి. ఇలాంటి నవ్య చికిత్సా పద్ధతులపై వీక్షణమే ఈ వారం కవర్ స్టోరీ…

కవిత్వానికి ప్రయోజనముందా ?
కవిత్వం పుట్టినప్పటినుంచి గ్రీకులను , రోమన్లను, ఈజిప్షియన్ లను , చైనీయులను మాత్రమే కాదు భారతీయులను కూడా తొలుస్తున్న పెద్ద ప్రశ్న ఇది ! ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెల్సుకోవడానికి ముందు రెండో ప్రపంచయుద్దానంతర బ్రిటిష్ కవులలో అత్యంత ప్రసిద్దిగాంచిన కవి Ted Hughes గురించి తెల్సుకోవాలి. ఏడేళ్ళ బాల్యం నుండే కవిత్వం రాయడం మొదలెట్టి Hawk in the Rain (1957), Crow : From the life and songs of the crow (1970), River (1983), Flowers and Insects (1987) వంటి వైవిద్యమైన రచనల ద్వారా ప్రపంచసాహితీ ఆకాశంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించారు. సాహిత్యం వంటి కళాత్మక సృజనలు మానసిక సాంత్వనను మాత్రమే కాదు రోగనివారణని కూడా వాక్యాలవెంట తీసుకువస్తాయని, కవిత్వం ఈ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నెరవేరుస్తుందని ఆయన ఇలా ప్రకటించారు.
‘ Prose, narratives et cetera, can carry healing. Poetry does it more intensely!’
ఈ మాటలు పై ప్రశ్నకు కొంతవరకు సమాధానాన్ని చెపుతాయి. కవిత్వానికుండే వాస్తవిక, గుణాత్మక, పరిమాణాత్మక, పరిణామాత్మక ప్రయోజనాన్ని వివరిస్తాయి.
సాధారణంగా కవిత్వం – మనోల్లాసం, చైతన్యం, ఉద్వేగ సంతులనం, జీవనవికాసం, మానసిక సాంత్వన వంటి మానసిక, ఉద్వేగ ప్రభావాలనే చూపిస్తుందని అనుకుంటాము. కానీ కవిత్వానికి, శారీరకమైన అనారోగ్యాన్ని, భౌతిక ఆరోగ్య సమస్యలను సైతం ప్రభావితం చేయగల శక్తి ఉందని Ted Hughes మాటలు సరికొత్తగా ఆవిష్కరించాయి.
వేర్వేరు సందర్బాలలో సంగీతానికి రోగనివారణశక్తి ఉందని, ఆనారోగ్య సమస్యలను పరిష్కరించడానికి అలా ఉపయోగించే చికిత్స విధానాన్ని Music Therapy అంటారని మనకు తెలుసు. మెడిసిన్స్ , సర్జరీ , ఔషధాలకు అతీతంగా చేసే ఈ తరహా కళాత్మక చికిత్సా ప్రక్రియలలోకి కవిత్వం కూడా చేరి, ఇప్పుడు ‘పొయెట్రీ థెరఫీ’ అనే మాట ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇప్పటివరకు మనం కార్టూన్లలోనూ, సినిమాలలోని కామెడీ సన్నివేశాలలోనూ కవిత్వాన్ని ఓ శిక్ష గానూ, కవిత్వభాష ‘ చెవుల నుంచి రక్తాలు కారేలా’
చేసే ఆయుధంగానూ మాత్రమే చూసాం. కారణాలు ఏవైనప్పటికి మీడియాలో సైతం కవిత్వం కేవలం హాస్యాస్పదంగా మాత్రమే మారి పోయింది. కానీ పాశ్చాత్య దేశాలలోనూ, మన దేశం లోని మేధావి వర్గాలలోనూ కవిత్వానికి, కవితా పంక్తులకు ఉండే గౌరవం ఇప్పటికీ గొప్పగా ఉందనే చెప్పాలి. అందుకే అక్కడ కవిత్వం కేవలం భావోద్వేగాలను , హృదయోల్లాసాన్ని కలిగించే విశేష కళ అనే దశను దాటేసి, కవిత్వం ఓ చికిత్స అనీ; కవితారచన, గానం, పఠనం చికిత్సలో అంతర్భాగమేననే దశకు వచ్చింది . యూరప్ వంటి దేశాలలోని ప్రముఖ వైద్య పరిశోధనా సంస్థలు, డాక్టర్లు దీనికి పొయెట్రీ థెరఫీ అనే పేరు పెట్టి, ప్రత్యామ్నాయ వైద్యం (Alternative Medicine)
గా గుర్తింపునిచ్చారు. అమెరికా , జపాన్ వంటి మరికొన్ని దేశాల వైద్యాలయాలు ఈ విధానాన్నే Biblio-therapy ( పుస్తకాల అధ్యయనం ద్వారా చికిత్స) అని కూడా పిలుస్తున్నాయి. సాహిత్యంలోని వివిధ ప్రక్రియలు, శైలులను ఉపయోగించి వ్యక్తులలో రోగనివారణ చేయడం, వారిలో సానుకూల ప్రగతిని (Positive Growth) రప్పించడం ఈ చికిత్స ప్రధానాంశం.

ఇప్పుడు మళ్ళీ మన ప్రశ్నలోకి వద్దాం !
అసలు కవిత్వం ప్రయోజనం ఏమిటి? ఈ చిరకాల ప్రశ్నకి సమాధానాల గురించి అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలో ఈ ప్రశ్న కు సమాధానం గా సమాజ హితం ( సహితస్య భావః సాహిత్యం ), లోక కళ్యాణం, రసానందం, హృదయ చైతన్యం, ప్రజా అవగాహన, పాండిత్య ప్రదర్శన, మేధో వికాసనం, జ్ఞాన వ్యాప్తి, సంస్కరణాత్మకత, ఉత్తమ విలువలు- సంస్కారాల ప్రచారం, భావజాల వ్యాప్తి, అభ్యుదయం, ప్రగతి కాంక్ష వంటి మాటలను చెప్తూ వచ్చాం. ఆ క్రమంలో ఇప్పుడు వచ్చిన నవ్య భావన – ‘కవిత్వ ప్రయోజనం – చికిత్స’ అనేది. ఈ విషయం కొంత ఆశ్చర్యంగానూ, అనూహ్యంగానూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఇది క్రమంగా
ఆమోదయోగ్యతను సాధించి చికిత్సావిధానంలో కొత్త ద్వారాలను తెరిచింది.

మనోవైజ్ఞానిక శాస్త్రం ఏం చెపుతోంది ?
కవిత్వానికి కాకరకాయలు కాస్తాయా? సాహిత్యానికి సంపెంగలు పూస్తాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం కష్టం . కానీ కవిత్వంతో కన్నీళ్ల్లు తగ్గుతాయని, సాహిత్యంతో సమస్యలు నిదానిస్తాయని అంతర్జాతీయంగా జరిగిన , జరుగుతున్న ఎన్నెన్నో మనోవైజ్ఞానిక పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఈ విషయాన్ని వివరించడానికి ఒక్కసారి మానసిక శాస్త్రంలోని కొన్ని అంశాలను పరిశీలిద్దాం. ఎందుకంటే సాహిత్యం, కవిత్వం మానవ మేధస్సులోంచి , మస్తిష్కం లోంచి ఉద్భవించే ఉత్పన్నకాలు… మనోజనితాలు (Poetry and Literature is the product of imagination and creativity. They have the origin in human mind) కనుక ఈ అంశాన్ని Psychological Science లోని Psycho-linguistics కోణంలోంచి విశ్లేషించడం అవసరం.
సైకాలజీ లో Pshcho-somaticism, Somato-psychicism అనే రెండు విషయాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. Psycho-somaticism అంటే మానసికపరమైన అంశాలు మనిషి శారీరక అంశాలను ప్రభావితం చేయడం. అలాగే Somato-psychicism అంటే, మనిషి శారీరక – భౌతిక పరమైన అంశాలు మనసు స్థితిగతులను నిర్ణయించడం అని చెప్పాలి. అంటే మనసు – శరీరాన్ని, శరీరం – మనసుని పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఉంటాయన్నమాట . ఈ అంశాన్నే తత్వ శాస్త్రంలో Rene Descartes 15వ శతాబ్దంలోనే Body – Mind Dichotomy అని ” మనశ్శరీరాల ద్వంద్వత” అనే అన్నారు. ఈ ద్వంద్వత ఒకదానినొకటి పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఉంటాయని, ఆ ప్రభావాల ఫలితమే మనిషి ప్రవర్తన అని వివరించారు.

ఇక కవిత్వం మనోజనితమూ , మానసికగతమూ కనుక కవితా వాక్యాలు , అక్షరాలు, భావచిత్రాలు, ఉపమానాల ద్వారా అనారోగ్యంపాలైన మనిషిలో స్టైర్యాన్ని, శాంతిని ఏర్పర్చి తద్వారా శరీరంలో కూడా తదనుగుణమైన సానుకూల మార్పులు తీసుకురావడం జరుగుతుందన్నమాట. !

కవిత్వం ఓ కేథార్సిస్ !
కవిత్వం ఓ అభివ్యక్తి. మనసులో చెలరేగిన సంఘర్షణలు, భావోద్వేగాలు అక్షర రూపంలోకి తర్జుమా అయితే వచ్చేదే కవిత్వం! అలా మనోభావాలు కవిత రూపంలో వ్యక్తీకృతం అయిన తర్వాత రాసిన కవిలో ఆ సంఘర్షణ, భావోద్వేగం తాలూకు ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుందని ఎన్నెన్నో పరిశోధనలలో రుజువు అయింది. దీనినే సైకాలజిస్టులు “కేథార్సిస్ ” ( ప్రక్షాళన ) అని చెపుతారు. ఈ విషయాన్ని మనో విశ్లేషణ పితామహుడైన సిగ్మాండ్ ఫ్రాయిడ్ అనుచరుడైన జోసెఫ్ బ్రూయెర్ అనే సైకాలజిస్ట్ చెప్పడమే కాక, చికిత్సలో ఈ విధానాన్ని ఉపయోగించాడు.
దీని ప్రకారం మనిషి మనసు ఒక దీపపు సెమ్మె లాంటిది. దీపం వెలుగుతున్నపుడు, చిమ్నీ కి మసి పడుతుంది. అప్పుడు ఆ చిమ్నీని గుడ్డతో తుడిచి మళ్ళీ వెలుగు ప్రసరించేలా చూస్తాం. నిత్య జీవితంలో ఎదురైన సంఘటనల వల్ల కలిగిన వేదన, దుఃఖం, ఒత్తిడి మసిలాగా పేరుకొని దీపపు కాంతి కనిపించనంత విషాదాన్ని ఇస్తాయి. ఇక్కడ మసిని తుడవడం అంటే, అభివ్యక్తి చేయడం ద్వారా మనసులో పేరుకున్న విషాదం తొలగించి ప్రశాంతతని చేకూర్చడమే! ఆ లెక్కన వేదనతో కునారిల్లుతున్న కవి తన కవితాభివ్యక్తి ద్వారా ప్రశాంతతను పొందుతాడు. ఆ విధముగా కవిత్వం ఓ కేథార్సిస్ అని చెప్పవచ్చు. కవిత్వాన్ని సైతం ఒక చికిత్సా విధానంగా రూపొందించే క్రమంలో ఇది కీలక అంశంగా అందరి దృష్టిని ఆకర్షించింది!

కవిత్వానికి అంత శక్తి ఉందా?
నిజానికి కవిత్వానికి, కవిత్వంలోని భావాలకు మనుషులను, వారి రోగాలను తగ్గించేంత ప్రభావం ఉంటుందా ? దీనికి సమాధానం చెప్పాలంటే Psychology లోని మరో రెండు భావనలని కూడా ఇక్కడ ఉదహరించాలి. అవే (1) ప్లాసిబో ప్రభావం (Placibo Effect ) (2) నోసిబో ప్రభావం (Nocibo Effect)

శారీరకంగానూ, ఔషధాల ద్వారానూ మనిషిలోని రోగాన్ని నయం చేయలేమని డాక్టర్లు సైతం చేతులెత్తేసిన సందర్భంలో, రోగి మనసులో బలంగా పాదుకున్న సరైన ఆలోచనలు, సానుకూల సంకల్పం అతని శరీరాన్ని చైతన్య వంతం చేసి, ఆ వ్యక్తి శారీరక భౌతిక స్థితిని దానికి అనుగుణంగా సమాయత్తం చేసి ఆ వ్యక్తిని ప్రమాదం నుంచి తప్పించగలిగే మానసిక స్థితియే – Placibo Effect.!

అలాగే శారీరకంగానూ, మెడిసిస్ పరంగానూ రోగాన్ని మటుమాయం చేయగలమని డాక్టర్లు భావించినప్పటికి, రోగి మస్తిష్కంలో రూపొందిన ప్రతికూల దృక్పథం, వ్యతిరేక ఆలోచనలు మొదట మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి, ఆ తర్వాత క్రమంగా శారీరకంగా సైతం వ్యక్తిని క్రుంగ దీసే స్థితియే – Nocibo Effect !!

ఈ రెండు శాస్త్రీయ పరిశోధనల వెలుగులో చూస్తే, మిగతా అన్నిరకాల కళారూపాలు, సాహిత్యంలోని ఇతర ప్రక్రియల కన్నా కవిత్వానికి, కవిత్వంలోని వాక్యాలకి మనుషులను ప్రభావితం చేసే శక్తి కొంచం ఎక్కువే ఉంటుందనేది తేటతెల్లమవుతుంది.!

కావ్యచికిత్సా సంఘం :
కవిత్వం – మనస్సు రెండు పరస్పర ఆశ్రితాలు . ఇవి రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడినవి మాత్రమే కాక, పరస్పరం ప్రభావితం చేసుకునేవి కూడా!
మనసులో జరిగే సంఘర్షణలు, సంతోషాలు, భావోద్వేగాలు కవిత్వంగా అక్షర రూపం దాలుస్తాయి. అలాగే అక్షరాలుగా కనిపించే కవిత్వంలో నిబిడీకృతమైన భావన పాఠకులలో కూడా చలనాన్ని తీసుకొచ్చి, మమేకత్వాన్ని ( Identification) తెస్తుంది. ఇక రాసిన కవికి కవిత్వం ఒక outlet గా మారి హృదయ భారాన్ని తగ్గించి, సమస్య తీవ్రతను కవిలో తగిస్తుంది.
ఈ విషయాలన్నిటినీ కూలంకశంగా గమనించారు కనుకే దాదాపు 37 ఏళ్ళ క్రితమే 1983 లోనే అమెరికాలో “జాతీయ కావ్య చికిత్సా సంఘం ” (National Association for poetry therapy )అనే పరిశోధనా సంస్థను ఏర్పాటు చేశారు. షికాగోలో జరిగిన అంతర్జాతీయ వైద్య సదస్సు ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చింది. రోగులకు వ్యాదుల వల్ల వచ్చే బాధను కవిత్వాన్ని ఉపయోగించి తగ్గించి, తద్వారా వారికి సహాయం చేయాలని ఈ సదస్సు తీర్మానించింది. ఈ సంస్థలోని సభ్యులు అంతర్జాతీయంగా పేరెన్నికగన్న డాక్టర్స్, థెరపిస్టులే కావడం గమనార్హం. కాగా ఈ సంస్థ సుధీర్ఘ కాల పరిశోధనల అనంతరం పొయెట్రీ ని ఆధారంగా చేసుకుని “సమీకృత వైద్యం” (Integrative Medicine Packet) అనే చికిత్సా విధానాన్ని రూపొందించి , శిక్షణను కూడా ఇవ్వడం మొదలెట్టింది. ఈ శిక్షణా కోర్సుని సక్రమంగా పూర్తి చేసిన వారికి “ధృవీకృత కావ్య చికిత్సకుడి”గా (Registered Poetry Therapists (R.P.T.) గా కూడా పట్టాలు ప్రధానం చేస్తుంది. ఇలా పొయెట్రీ థెరఫీ పేరిట కవిత్వ ప్రయోజనం ఇప్పుడు సువ్యవస్థీ కృతం అయింది. కవిత్వానికి చింతకాయలు రాలుతాయో లేదో తెలీదు కానీ, చింతలు మాత్రమే కాదు, చిరకాల వ్యాధులు కూడా నయం అవుతాయని సాధికారికంగా ఈ సంస్థ నిరూపిస్తుంది.

కావ్య చికిత్సలో దశలేంటి ?
ఇక కవితలను ప్రత్యామ్నాయ చికిత్సా విధానంగా ఉపయోగించే క్రమంలో అది సాధిస్తున్న ఫలితాలను అనుసరించి వివిధ దశలు మనకు కనిపిస్తాయి.
1. వ్యాధి గురించిన అవగాహన కల్పించడం (Awareness Creation)

2. అపోహలు తొలగించడం (Clearance of misconceptions)

3. వ్యాధిని అంగీకరించగలిగే మానసిక సంసిద్ధత (Mental Preparation)

4.వ్యాధిని ఎదుర్కోగలిగే ధైర్యాన్నివ్వడం (Confidence Building Measures)

5. వ్యాధి నయంకావడం (Cure from Disease)

6. వ్యాధితో సైతం గౌరవంగా బ్రతకగలిగే ఆశావాదాన్ని పాదుగొల్పడం (Living with Disease with honour and Respect)

 

రోగం..వ్యాధి… కావేవీ కావ్యచికిత్సకనర్హం.!
మహాకవి శ్రీ శ్రీ కవితా వస్తువు గురించి చెపుతూ ‘కాదేదీ కవితకనర్హం ‘ అన్నారు. తెలుగులో తొలి సాహిత్యమైన పంపన విక్రమార్జున విజయం, నన్నయ విరచిత మహాభారతం
నుండి మొదలుకొని నేటి భావ వాద, అభ్యుదయ, దిగంబర, విప్లవ, అత్యాధునిక వచన కవిత్వం, దళిత, స్త్రీవాద, మైనారిటీ, తెలంగాణా అస్తిత్వవాద కవిత్వాల వరకూ ఆయా కవులు తమ కవితల కోసం ఎంపిక చేసుకున్న కవితా వస్తువులను గమనిస్తే శ్రీశ్రీ మాటలు నిజమే అనిపిస్తాయి. మనిషిని పరివేష్టించి ఉన్న సమస్త అంశాలను కవితా వస్తువులుగా చేసుకుని ఇప్పటికే వేలాది కవితలు వచ్చాయి. అయితే ఇవన్నీ ప్రధానంగా సామాజిక, ఆర్థిక , రాజకీయ, సాంస్కృతిక, ప్రాపంచిక, ఆధ్యాత్మిక, చారిత్రక, అస్తిత్వ వాద, ప్రాంతీయవాద, తాత్విక ధోరణులను ఆశ్రయించే ఉన్నాయని చెప్పాలి.
ఇన్ని అంశాలలో మనిషికి సంబంధించిన మరో అనివార్య కవితా వస్తువు – ఆరోగ్యం! ఈ ఆరోగ్యం – వ్యాధులు, దాని సంబంధిత అంశాలను కవిత్వంలో ఉపమానాలుగా , ఉదాహరణలుగా , సంకేతాలుగా Symbolism తోనే ఎక్కువగా రాశారు. వీటినే ప్రధాన వస్తువుగా చేసుకుని చేసిన కవితా రచనలు సంఖ్యాపరంగా తక్కువగానే ఉన్నప్పటికీ అవి చూపిన ప్రభావం మాత్రం ఎక్కువే అని ఎన్నో సందర్భాలలో రుజువయింది. అయితే మనిషిలోని మానసిక ఆరోగ్య సంబంధ అంశాలైన డిప్రెషన్ , మనోవేదన, ఆత్మహత్య వంటి అంశాలే వస్తువులుగా ఎన్నెన్నో రకరకాల నేపధ్యాలతో కవితలు , కవితా సంకలనాలు వచ్చాయి. అవన్నీ శారీరక, మానసిక అనారోగ్య పీడితులలో ధైర్యాన్ని నింపి బతుకు పట్ల అనురక్తిని పెంచాయి. “ఒక్క అక్షరం లక్ష మెదళ్ళకు కదలిక ” అని ప్రజాకవి కాళోజి నారాయణ రావు అన్నట్లు, కవితలు, కవితా పంక్తులు మనుషులలో మానసిక చైతన్యానికి, ఆ తర్వాత శారీరక సుస్థితికి కూడా దారి తీస్తూ ఆరోగ్య రక్షణలో అదృశ్య పాత్రను పోషిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు, వైద్యులు అందరూ గమనిస్తూ, ఇలాంటి కావ్య చికిత్సను ప్రోత్సహిస్తున్నారు. ఆ లెక్కన కవిత్వం ఇప్పుడు ఓ నవ్య చికిత్స కాగా, కవులు అక్షర వైద్యులుగా భావించ వచ్చు.!
—– harikrishna mamidi 8008005231

**Source from: Andhrajyothi Weekly Magazine**