హైదరాబాద్: ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ 90 శాతం ప్రభావంతంగా ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని ఫైజర్ సంస్థ ప్రకటించింది. మూడవ దశ ట్రయల్స్ ఆధారంగా ఈ విషయం తేటతెల్లమైంది. రెండవ డోసు ఇచ్చిన ఏడు రోజుల తర్వాత రోగుల్లో కోవిడ్‌కు వ్యతిరేక రక్షణ శరీరంలో డెవలప్ అయినట్లు గుర్తించారు. తొలి డోసు ఇచ్చిన 28 రోజుల తర్వాత కూడా ఈ తేడా కనిపించినట్లు ఆ రెండు కంపెనీలు వెల్లడించాయి. కోవిడ్ వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ ద్వారా కోవిడ్19ను నివారించే తొలి ఫలితాలు వచ్చినట్లు ఫైజర్ చైర్మన్, సీఈవో ఆల్బర్ట్ బౌర్లా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఆరోగ్య సంక్షోభాన్ని నివారించేందుకు కొత్త మెట్టుకు దగ్గరయ్యామని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలకు అత్యవసరమైన సమయంలో వ్యాక్సిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో కీలకమైలురాయిని చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది 5 కోట్ల వ్యాక్సిన్లను పంపిణీ చేయనున్నట్లు ఆ కంపెనీ చెప్పింది. ఇక వచ్చే ఏడాది సుమారు 103 కోట్ల డోసులను సరఫరా చేయనున్నది.
