జొమాటోలో…ఖ‌రీదైన ఆర్డ‌ర్‌…అతి చిన్న ఆర్డ‌ర్…

ఇండియా 2020లో ఏం ఆర్డ‌ర్ చేసింది, ఎలా చేసింది అనే విష‌యాల‌ను మేమ్స్ ద్వారా వినూత్నంగా చెప్పింది ప్ర‌ముఖ ఫుడ్ డెలివ‌రీ యాప్ జొమాటో. ఖ‌రీదైన ఆర్డ‌ర్‌, అతి చిన్న ఆర్డ‌ర్‌, వెజ్ బిర్యానీల ఆర్డ‌ర్‌ల‌పై మేమ్స్ క్రియేట్ చేసింది.

అత్య‌ధికంగా వెజ్ బిర్యానీ

ఇండియాలో 2020లో అత్య‌ధికంగా వెజ్ బిర్యానీని ఆర్డ‌ర్ చేసిన‌ట్లు జొమాటో చెప్పింది. ప్ర‌తి నిమిషానికి తాము 22 బిర్యానీ ఆర్డ‌ర్లు డెలివ‌ర్ చేసిన‌ట్లు తెలిపింది. మొత్తంగా జొమాటోకు 2020లో 19,88,044 వెజ్ బిర్యానీ ఆర్డ‌ర్లు వ‌చ్చాయ‌ట‌. ఆ త‌ర్వాతి స్థానంలో పిజ్జా ఆర్డ‌ర్లు నిలిచాయి. 2020లో మొత్తం 17 ల‌క్ష‌ల‌కుపైగా పిజ్జా ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్లు జొమాటో తెలిపింది. అందులో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లోని జాలాగావ్‌కు చెందిన ఓ వ్య‌క్తి 369 పిజ్జాలు ఆర్డ‌ర్ చేశాడ‌ట‌.

ఖ‌రీదైన ఆర్డ‌ర్ ఏది?

2020లో అత్య‌ధికంగా బెంగ‌ళూరుకు చెందిన య‌ష్ అనే వ్య‌క్తి 1380 ఆర్డ‌ర్లు ఇవ్వ‌డం విశేషం. ఆ లెక్క‌న స‌ద‌రు క‌స్ట‌మ‌ర్ ప్ర‌తి రోజూ నాలుగు ఆర్డ‌ర్లు చేశాడు. ఇక ఏడాదిలో ఖ‌రీదైన ఆర్డ‌ర్ రూ.1,99,950. ఈ ఆర్డ‌ర్ ఇచ్చిన వ్య‌క్తికి రూ.66,650 డిస్కౌంట్ ఇచ్చారు. ఇక అతి చిన్న ఆర్డ‌ర్ విలువ రూ.10.01 అట‌. గులాబ్ జామూన్ ఈ ఏడాది ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేసిన స్వీట్ కాగా.. ఒక్క దీపావళి వారంలోనే ల‌క్ష‌కుపైగా గులాబ్ జామూన్ ఆర్డ‌ర్లు రావ‌డం విశేషం.