సింగరేణిలో త్వరలో పోస్టుల భర్తీ : సీఎండీ శ్రీధర్‌

హైదరాబాద్‌ : సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 651 ఉద్యోగాలను రాబోయే మార్చిలోగా భర్తీ చేస్తామని సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ శుక్రవారం తెలిపారు. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలకు త్వరలోనే వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 569 కార్మికులు, 82 అధికారుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు చెప్పారు. కార్మికుల విభాగంలో ఎలక్ట్రిషన్లు, వెల్డర్‌ ట్రెయినీలు, మిషన్‌ ట్రెయినీలు, మోటార్‌ మెకానిక్‌, మౌల్డర్స్‌ పోస్టులున్నాయి. అధికారుల స్థాయిలో పర్సనల్‌ ఆఫీసర్లు, మెయిన్‌మేంట్‌ ట్రెయినీలు, వివిధ జూనియర్‌ ఫారెస్ట్‌ అధికారుల పోస్టులున్నాయి. వీటితో పాటు జూనియర్‌ స్టాఫ్‌నర్సులు, టెక్నీషియన్లు, ఫార్మాసిస్ట్‌లు తదితర వైద్య సిబ్బందిని సైతం త్వరలోనే నియమిస్తామని చెప్పారు. ఇవేకాకుండా త్వరలో అంతర్గత సిబ్బందితో 1,436 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.ప్రస్తుతం సింగరేణిలో పని చేస్తూ అర్హత ఉన్న ఉద్యోగులతో భర్తీ చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దానికి అనుగుణంగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సింగరేణి యాజమాన్యం పేర్కొంది. ఆపరేటర్లు, ఫిట్టర్‌ ట్రెయినీలు తదితర విభాగాల్లో అర్హత ఉండి.. వేరే విభాగాల్లో పని చేస్తున్నారు. 1,436 పోస్టులు ఉండగా.. పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడుతామని సీఎండీ చెప్పారు. ఈ మేరకు త్వరలో అంతర్గతంగా నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు సీఎండీ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 13,934 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు శ్రీధర్‌ ప్రకటించారు. ఇంటర్వ్యూ లేకుండా రాత పరీక్ష, ప్రతిభ ఆధారంగానే నియామకాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తే నమ్మొద్దని సూచించారు. ఉద్యోగాల కోసం అభ్యర్థులంతా కష్టపడి చదివి పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు.