2021 లో పెళ్ళి  లగ్గాల్లేవ్

వరంగల్: కరోనాతో ఈ ఏడాది పెండ్లిళ్ల సీజన్ కళ తప్పింది. లాక్ డౌన్ పెట్టడంతో చాలామంది లగ్గాలు వాయిదా వేసుకున్నారు. లాక్ డౌన్ ఎత్తేసినంక కొంతమంది చేసుకున్నప్పటికీ, ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి లగ్గాలకు బ్రేక్ పడనుంది. కొత్త ఏడాదిలో 5 నెలల వరకు పెండ్లిలు లేవని పూజారులు చెబుతున్నారు. జనవరి 7 వరకు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయని, ఆ తర్వాత అన్నీ మూఢాలేనని పేర్కొంటున్నారు. మళ్లీ 2021 మే 16 నుంచే మంచి ముహుర్తాలు ప్రారంభమవుతాయని అంటున్నారు. దీంతో పెండ్లిలు వాయిదా వేసుకున్నోళ్లు, చేసుకుందామని రెడీ అవుతున్నోళ్లు నిరాశ చెందుతున్నారు. మరోవైపు లగ్గాలపై ఆధారపడి ఉపాధి పొందేవాళ్లు నాలుగైదు నెలలు పని ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనాతో సీజన్ ఖతం…

కరోనా వల్ల ఈ ఏడాదిలో పెండ్లిళ్ల సీజన్ వృథా అయింది. మార్చిలో పెండ్లిలు ఊపందుకున్న టైమ్ లోనే లాక్ డౌన్ పెట్టడంతో.. లగ్గాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అప్పటికే ముహూర్తాలు పెట్టుకొని ఏర్పాట్లు చేసుకున్నోళ్లు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం దశల వారీగా ఆంక్షలను సడలించడంతో కొంతమంది మాత్రమే అతి తక్కువ మంది సమక్షంలో లగ్గాలు చేసుకున్నారు. లాక్​డౌన్​ తర్వాత కొన్ని ముహూర్తాలు ఉండటంతో ఈ మధ్య ఫంక్షన్ హాళ్లు కళకళలాడుతున్నాయి. అయితే జనవరి 7తో ముహూర్తాలు ముగుస్తుండడంతో, అంతలోపు లగ్గాలు చేయాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు.

ఉపాధికి దెబ్బ…

సాధారణంగా సంక్రాంతి తర్వాత నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి మూఢాలు రావడంతో పెండ్లిలు, ఇతర శుభకార్యాలపై ఆధారపడి బతుకుతున్నోళ్లు ఉపాధి కోల్పోనున్నారు. పూజారులు మొదలుకొని ఫంక్షన్ హాల్స్, డెకరేషన్, టెంట్ హౌస్, బ్యాండ్ మేళం, డీజేలు, ట్రావెల్స్… ఇలా వివిధ బిజినెస్ లపై ఎఫెక్ట్ పడనుంది. వీటిలో పని చేస్తున్న వేలాది మంది పని కోల్పోనున్నారు. సిటీలో కేవలం పెండ్లిల సీజన్ లోనే వచ్చే ఆదాయం మీదే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. కరోనా గండం నుంచి బయటపడ్డామని సంతోషిస్తున్న టైమ్ లో.. మూఢాలు రావడంపై వారందరూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.