బహుళ సంస్కృతుల జీవగడ్డ హైదరాబాద్

హైదరాబాద్…పరమత సహనానికి పుట్టినిల్లు. భిన్న సంస్కృతుల జీవగడ్డ. నా నగరంపై విషంగక్కే నోళ్ళకి ఈ నేల పై విరాజిల్లిన సహజీవన సౌందర్యం తాలూకు స్మృతులే బదులు…!
పాతబస్తీ పై పెట్రేగిపోతున్న వాళ్ళకి స్వామి వివేకానంద అదే బస్తీలో నవాబు గారి ఆతిథ్యం పొందిన సంగతి తెలియదేమో. ఒకసారి వివేకానందుడి జీవిత చరిత్ర తిరగేయండి…అందులో పాతబస్తీ ఔన్నత్యం కనిపిస్తుంది. అవును మరి, 1892, ఫిబ్రవరి 10నుంచి18 వరకు వివేకానంద నగరంలో బస చేశారు. అదే సమయంలో ఆరో నిజాం బావ మరిది ఖుర్షిద్ జా వివేకానంద ని హుస్సేని ఆలం లోని తన దేవిడీకి ఆహ్వానించారు. అక్కడ ఇరువురూ కూర్చొని హిందూ, ముస్లిం మతాల్లోని ఔన్నత్యం పై చర్చించుకున్నారు. అప్పుడే, వివేకానంద చికాగో ప్రయాణానికి ఖుర్షిద్ ఆర్ధిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. “అవసరమైతే తప్పక అడుగుతానని” అందుకు వివేకానంద బదులిచ్చారు. ఇదొక్క ఉదాహరణ చాలు, పాతబస్తీ సంస్కృతి అర్ధం చేసుకోడానికి…
స్వాతంత్ర్య సంగ్రామంలో నేతాజీ వెన్నంటే ఉండి, ఆజాద్ హింద్ ఫౌజ్ లో ఆయుధం పట్టిన పోరాట యోధుడు అబిద్ హాసన్ సఫ్రానీ పుట్టి,పెరిగిందీ పాతబస్తీలోనే. హిందూస్థాన్ విముక్తి కోసం తన తల్లిదండ్రులు పెట్టిన “జయిన్ ఆల్ అబ్దిన్” పేరును, సఫ్రానీ గా మార్చుకున్న అబిద్ కన్నా మీరు దేశభక్తులా. నేతజీతో కలిసి 90 రోజులు జలాంతర్గామిలో ప్రయాణించిన సాహస వీరుడు అబిద్ పుట్టిన నేల పైనే సర్జికల్ స్ట్రైక్ చేస్తారా.! జాతీయ గీతం ముగింపులో మనమంతా తలెత్తి అభివాదం చేసే “జైహింద్” పిలుపు ను మొదట ప్రతిపాదించింది అబిద్ అని మీకు తెలిసుండదు. అలాంటి విషయాలు మన వాట్సాప్ యూనివర్సిటీల్లో చెప్పరుగా.! జాతీయ గీతాన్ని హిందూస్థానీ లోకి అనువదించిందీ పాతబస్తీ లో పుట్టిన అబిద్ సఫ్రానీనే.! దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ఆ మహనీయుడు పుట్టిన నేల మీదే విద్వేషం వెళ్లగక్కటానికి నయా భక్తులకెంత ధైర్యం.!
ఒకనాటి హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి మీర్జా యార్ జంగ్ 1936లో పాతబస్తీలో ని శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ సభలో పాల్గొని, “శ్రీకృష్ణ-హింద్ ప్రవక్త” అంటూ అర్ధగంట ఉపన్యసించిన మహత్తర ఘట్టానికి ఈ నేలే సాక్ష్యం. శ్రీకృష్ణుడి గీతా బోధనలోని తాత్వికతను గొప్పగా వర్ణించిన ఆ మహనీయుడి స్ఫూర్తి ఇంకా మిగిలుందని గుర్తుంచుకో.!
అత్తాపూర్ రాంబాగ్ గుడిలో మూడో నిజాం సికిందర్ జా ప్రతిష్టించిన సీతారామ, లక్ష్మణుల విగ్రహాలు సాక్షిగా హైదరాబాదీయులంతా ఒక్కటే. అందుకు ఆధారాలు కావాలంటే గుడి మల్కాపూర్ బాలాజీ దేవాలయం, సీతారాంబాగ్ లోని రాములోరి గుడికెళ్లచ్చు. ఆ మందిరాల పునాదులపై ఆధారాలు ఎప్పటికీ భద్రంగా ఉంటాయి.
ఇంకా అనుమానం ఉంటే… దీపావళి సంబరాలకు, క్రిస్మస్ సందడికి, రంజాన్ వేడుకలకి ఆలవాలమైన అలనాటి ఎర్రమంజిల్ ప్యాలెస్ చరిత్ర పుటను తడిమి చూడు…అందులో మతాలకతీతంగా మెలిగిన మనుషుల స్మృతులు కనిపిస్తాయి. ఆరో బ్రిటీషు రెసిడెంట్ కిర్క్ ప్యాట్రిక్, నవాబుల అమ్మాయి ఖైరునిస్సా ప్రేమ కథ చదువు…ఈ నేల సహజత్వం అర్ధమవుతుంది. భద్రాద్రి రాముడిని కలువు, ఈ నగర ఔన్నత్యాన్ని వివరిస్తాడు.
కోటి మందిని గర్భీకరించుకున్న నా హైదరాబాద్ గాలిలో సుహృద్భావం కలగలిసుందనడానికి ఇలాంటివెన్నో చారిత్రిక సందర్భాలను నగర వాకిట రాశులుగా పోసిన నాటి మహనీయులకు నేటి తరం అలై బలై.
ఇక్కడ మతాల కన్నా మనుషులకే విలువెక్కువ. ఇక్కడున్నదంతా మానవత్వమే..!
‘మల్కిభరాముడిగా కీర్తికెక్కిన ఇబ్రహీం, విజయనగర సామ్రాజ్య రాకుమారి భాగీరధీ ల కొడుకు మహ్మద్ కులీ కుతుబ్ షా కట్టిన నగరానికి నీవు పేరు మార్చేదేంటి బోడి’ అని హుస్సేన్ సాగరంలోని తథాగతుడు మీ సంకుచితత్వాన్ని చూసి నవ్వుతున్నాడు.
“అరమరికలు లేని నా ఇంట్లో అశాంతిని లేవనెత్తాలనుకుంటావా” అని చార్మినార్ మీ ముఖాన ఉమ్మక ముందే తప్పు తెలుసుకొని లెంపలేసుకోడం మంచిది. లేకుంటే, అసలుకే మోసం రాగలదు జాగ్రత్త.!
– హైదరాబాదీ వెంకటేశ్.