గడిచిన ఆరేండ్లలో హైదరాబాద్ విశ్వనగరాల్లోనే ది బెస్ట్ లివబుల్ సిటీ (ఉత్తమ నివాసయోగ్య నగరం)గా కీర్తిని దక్కించుకుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, మున్సిపల్, నగరాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు నాయకత్వంలో.. హైదరాబాద్ నగరాన్ని అచ్చమైన ప్రపంచ నివాసయోగ్యమైన, ఇష్టపడే నగరంగా తీర్చిదిద్దడానికి బహుముఖమైన సమగ్ర విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. తత్ఫలితంగా క్రియాశీల ప్రణాళిక, విశిష్టమైన కార్యక్రమాలతో గత ఆరేండ్లలో నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు, పౌర సేవలు అమలయ్యాయి. 2011 లెక్కల ప్రకారం జనాభాలో హైదరాబాద్ దేశంలోనే నాల్గవ స్థానంలో ఉంది. నగర పరిధిలో 69 లక్షల జనాభా ఉంటే మొత్తం మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో 97 లక్షల మంది నివసిస్తున్నారు. మెట్రోపాలిటన్ జనాభాలో హైదరాబాద్ దేశంలోనే 6వ స్థానంలో ఉంది. 74 బిలియన్ డాలర్ల మేర ఉత్పత్తితో నగర ఆర్థిక వ్యవస్థలో దేశంలో 5వ స్థానంలో ఉంది. ఆరు దశాబ్దాల అభివృద్ధిని మించి.. గడిచిన ఆరేండ్లలో హైదరాబాద్ ప్రగతిపుంతలు తొక్కింది. అంతర్జాతీయ సంస్థలు భాగ్యనగర బాటపట్టాయి. అందుకే ఇప్పుడు హైదరాబాద్ అంటే కేవలం నగరం కాదు.. ఓ బ్రాండ్..
ఐటీ రంగం అభివృద్ధి
పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై దృష్టిసారించిన ప్రభుత్వం టీఎస్‌ఐపాస్ ద్వారా రూ.2,115.93కోట్ల పెట్టుబడులను రాబట్టింది. అలాగే రూ.1,96,404 కోట్ల పెట్టుబడుల ఆకర్షించడంతోపాటు 15లక్షల ఉద్యోగాలను కల్పించారు. టీఎస్ ఐపాస్ ద్వారా 9,500 పారిశ్రామిక యూనిట్లకు అనుమతి ఇవ్వగా, ఇప్పటికే 6,300 యూనిట్లు ఆపరేషన్స్ ప్రారంభించాయి. 2020లో జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఐటీ రంగ వృద్ధిని నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ప్రపంచస్థాయి కార్పొరేట్ కంపెనీలకు హైదరాబాద్ రెండో ఇల్లుగా మారింది. భారత్‌లోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ హైదరాబాద్‌లోని టీ-హబ్. ఇప్పటికే 1100కు పైగా స్టార్టప్‌ల అనుసంధానం, 1500కు పైగా ఉద్యోగాల కల్పనతోపాటు స్టార్టప్‌ల కోసం రూ.1800 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ద్వారా రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. స్కిల్స్, నాలెడ్జ్ ఉన్న వారికోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్)ను ఏర్పాటు చేసింది.
2014 నుంచి ఔటర్‌కు 3309.71కోట్లు
2014 నుంచి నేటి వరకు రూ.3309.71 కోట్లను అవుటర్ రింగు రోడ్డు ప్రాజెక్టుకు ప్రభుత్వం ఖర్చుచేసింది. ఇందులో ప్రధానంగా పటాన్‌చెరు-శంషాబాద్-హయత్‌నగర్-మేడ్చల్‌ను కలుపుతూ 158 కిలోమీటర్ల పొడవైన 8 లేన్ల రింగురోడ్డును 19చోట్ల సెంట్రల్ మీడియన్లు, ఇంటర్ చేంజ్‌లతో నిర్మించారు. ఔటర్‌కు వెలుపల వేర్వేరు దారులను కలుపుతూ రెండువైపులా సర్వీసు రోడ్డు, వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా 19ఇంటర్‌చేంజ్‌ల వద్ద ఆటోమేటిక్ టోల్‌బూత్ లను ఔటర్ వెంట అభివృద్ధి చేశారు.
పర్యాటకానికి పెద్దపీట
పర్యాటకానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రూ.34.66 కోట్లతో టూరిజం అభివృద్ధికి కీలక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా అతిథ్య గృహాలు (హోటల్స్, క్యాటరింగ్ యూనిట్లు), రవాణా సౌకర్యం(గైడెడ్ ప్యాకేజీ టూర్స్), వాటర్ ఫ్లీట్, సౌండ్-లైట్‌షోలు, పర్యావరణహిత టూరిజం, సాంస్కృతిక కట్టడాల పునరుద్ధరణ, కొత్త టూరిజం కట్టడాల నిర్మాణం, రూ.100 కోట్లతో వారసత్వ సంపదకు పూర్వవైభవం తీసుకువచ్చారు. అలాగే చారిత్రక కట్టడాలైన మొజంజాహీ మార్కెట్, చార్మినార్‌పై చార్‌కమాన్, లాడ్‌బజార్, మహబూబ్ చౌక్ క్లాక్‌టవర్, షాలిబండ క్లాక్ టవర్, పాత బ్రిటిష్ రెసిడెన్సీలకు గత వైభవం ఉట్టిపడేలా ఆధునిక హంగులను అద్దారు.
ఢిల్లీ తర్వాత.. పెద్ద మెట్రో
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో హైదరాబాద్ నగరంలో నిర్మితమైన మెట్రోరైల్ ప్రాజెక్టు విశిష్టమైనది. అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణా వ్యవస్థకు ఇదొక దిక్సూచి. ఢిల్లీ తర్వాత దేశంలోనే అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్ కలిగి ఉండి, సుమారు 72కి.మీ. 66స్టేషన్లు, నిరాటంక ప్రయాణానికి వీలుగా ఎంఎంటీఎస్ స్టేషన్లు, బస్‌డిపోలతో అనుసంధానమైన సమగ్ర రైలు టెర్మినల్స్ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రత్యేకత. స్మార్ట్‌కార్డుతో ఆటోమేటిక్ టికెట్ జారీ, గేట్ సిస్టమ్ వ్యవస్థ, పర్యావరణహిత ప్రయాణ విధానం, వాయుకాలుష్య, శబ్దకాలుష్య రహిత ప్రయాణం హైదరా బాద్ మెట్రోరైల్ అదనపు ప్రత్యేకతలు. రూ. 17,290.31 కోట్లతో దీనిని మూడు కారిడార్లుగా విభజిస్తూ నిర్మాణాలను పూర్తిచేశారు.
రూ.45 కోట్లతో బస్ షెల్టర్లు
హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో అధునాతన ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. 200 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో నిర్మించిన బస్ షెల్టర్లలో మొబైల్ చార్జింగ్ పాయింట్లు, వాటర్ డిస్పెన్సింగ్ యూనిట్లు, వైఫై, ఏటీఎం, కాఫీ వెండింగ్ యంత్రాలు, ఏసీ, ఆకట్టుకునే డిజైన్లతో చెత్త డబ్బాలు, భద్రతకు సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అలాగే కొన్నిచోట్ల 25 ఫీట్ల పొడవు, 8 ఫీట్ల వెడల్పుతో.. మరికొన్ని చోట్ల 20 ఫీట్ల పొడవు, 5 ఫీట్ల వెడల్పుతో 10 ఫీట్ల పొడవు, 5 ఫీట్ల వెడల్పుతో బస్‌షెల్టర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ప్రపంచ స్థాయి శాంతిభద్రతలు
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శాంతి భద్రతలపై దృష్టి సారించింది. రూ.1940.33 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ పోలీస్ వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించింది. కర్ఫ్యూలకు, అల్లర్లకు స్వస్తిపలికి భద్రతకు సరికొత్త నిర్వచనం చెప్పింది. అత్యాధునిక పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం, నగరవాసుల భద్రత కోసం లక్షల సీసీ కెమెరాలు, ‘హ్యాక్ ఐ’ యాప్, పోలీస్ గస్తీ బృందాల కోసం అధునాతన వాహనాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్‌స్టేషన్లు ఆహ్లాదంగా కనబడేలా సదుపాయాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో ఎంతపెద్ద నేరం జరిగినా కేవలం నిమిషాల వ్యవధిలోనే నేరస్తులను పట్టుకునే నిఘా వ్యవస్థ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. నగరాన్ని అనుక్షణం కనిపెట్టుకునేలా ఇంటిగ్రేటెడ్ పీపుల్ ఇన్ఫర్మేషన్ హబ్, మహిళల, చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, సైబర్ నేరాల నియంత్రణకు, ఛేదనకు ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
బస్తీ దవాఖానలు
రూ.30.51 కోట్లు వెచ్చించి నగరంలోని ప్రతి బస్తీలో ప్రభుత్వం దవాఖానను ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని చేరువ చేసింది. దేశంలోనే తొలిసారిగా అర్బన్ లోకల్ బాడీ కమ్యూనిటీ క్లినిక్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. నగరం మొత్తం 250 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయగా, వీటి పరిధిలో రోజూ ప్రతి దవాఖానలో 85-100 మందికి వైద్యసేవలు అందుతున్నాయి. రూ.152.03కోట్లతో అన్నపూర్ణ క్యాంటీన్‌లను ఏర్పాటు చేసి రూ.5కే రుచికరమైన భోజనం అందిస్తున్నారు. 150సెంటర్ల ద్వారా ప్రతి రోజూ 40వేల భోజనాలు సరఫరా చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. ప్రస్తుతం ఇవి 350 సెంటర్లలో నడుస్తున్నాయి.
పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు
పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ‘డబుల్ బెడ్‌రూం’ ఇండ్ల పథకానికి విశేష ప్రాధాన్యమిస్తున్నది. రూ.9700 కోట్లతో దేశంలోనే మొదటి సారిగా పేదల కోసం ఆత్మగౌరవ సౌధాలు నిర్మిస్తున్నారు. 111 ప్రాంతాల్లో లక్ష గృహాల నిర్మాణం చేపట్టారు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా కొల్లూరులో 124 ఎకరాల్లో 117 బ్లాకుల్లో 15,660 డబుల్ బెడ్‌రూం గృహాలను.. 20శాతం కన్నా తక్కువ వైశాల్యంలోనే నిర్మించారు. ప్రైవేట్ డెవలపర్స్ సహకారంతో కొల్లూరులో ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ తరహాలో పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్లు, బస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
క్లీన్‌సిటీ దిశగా..
స్వచ్ఛ హైదరాబాద్ కొరకు ప్రభుత్వం రూ.1716.33 కోట్ల నిధులను ఖర్చు చేసింది. పారిశుద్ధ్య పనులను మెరుగుపర్చడంతోపాటు నగరంలో స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రతి గల్లీలోనూ అందుబాటులోకి తీసుకువచ్చి చెత్త సేకరణలో కొత్త పద్ధతులను పాటించింది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో ఎనర్జీప్లాంట్ ఏర్పాటుతోపాటు గ్రీన్ క్యాపింగ్ చేయడంతో ఆ ప్రాంతంలో దుర్వాసన పోయి పచ్చదనం పరిఢవిల్లుతోంది. వేల సంఖ్యలో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించి ప్రజలకు అందుబాటు లోకి తీసుకువచ్చారు. వ్యర్థాల తరలింపు, ప్రాసెసింగ్ కొరకు కొత్తగా రెండు యూనిట్లను నెలకొల్పారు.
విపత్తుల నిర్వహణలోనూ..
దేశంలోనే విపత్తు నిర్వహణకోసం ప్రత్యేకంగా రూ.15కోట్లను వెచ్చించి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇటీవల హైదరాబాద్‌లో వరదముంపు నుంచి వేలాదిమంది ప్రజలను డీఆర్‌ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొవిడ్-19 వ్యాప్తి నిరోధానికి నగరంలో నాలుగుసార్లు డిస్‌ఇన్‌ఫెక్ట్ స్ప్రే చేశారు. విపత్తు వేళ సహాయ చర్యలకోసం డీఆర్‌ఎఫ్‌లో 360మంది సిబ్బంది పని చేస్తున్నారు. నిల్వ ఉన్న నీటిని, భవనాల శిథిలాలను తొలగించి బాధితులను కాపాడటం, వరద సహాయక చర్యలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, భవనాలు కూలినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో వీరి సేవలు ప్రశంసలందుకుంటున్నాయి.
దూప తీర్చిన భగీరథ
నగరంలో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధికి ప్రభుత్వం రూ.14,175.30 కోట్లను ఖర్చుచేసింది. అందరికీ రక్షిత తాగునీరు సరఫరా చేయాలనే సంకల్పంతో అర్బన్ భగీరథతో నగర ప్రజలకు తాగునీటి కష్టాలను దూరంచేసింది. 2014నుంచి 4,727 కిలోమీటర్ల పొడవునా పైపులైన్లను వేయడం, గోదావరి, కృష్ణ-3వ దశ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి.. దేశంలోనే సరిపడా తాగునీటిని అందిస్తున్న ఏకైక నగరంగా హైదరాబాద్ ఘనకీర్తిని సొంతం చేసుకుంది. 40కోట్ల లీటర్ల నిల్వ సామర్థ్యంతో ఔటర్ వెలుపల 230 జలాశయాలను నిర్మించడంతోపాటు మరిన్ని మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెట్రోనగరాల్లోనే అత్యధికంగా 25 శుద్ధి కేంద్రాల ద్వారా రోజుకు 77.2 కోట్ల లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేస్తున్నారు.
చెరువుల పునరుద్ధరణ
చెరువుల సుందరీకరణ పనుల కోసం రూ.376.8 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌లుగా మార్చడంతోపాటు నీటి పునరుద్ధరణ, అర్బన్ జలాశయాల అభివృద్ధి, చెరువుగట్ల సామర్థ్యం పెంపు, ఐర్లాండ్ స్లిట్ ట్రాప్ వంటివి ఏర్పాటు చేయడంతోపాటు కేబుల్ బ్రిడ్జిని నిర్మించి దుర్గం చెరువును అందంగా తీర్చిదిద్దారు.
సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు..
వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రూ. 8,410.00 కోట్లతో ట్రాఫిక్ సమస్యలకు సమగ్ర పరిష్కారం చూపింది ప్రభుత్వం. జనసమ్మర్ద రూట్లలో సిగ్నల్ లేని ప్రయాణం లక్ష్యంగా కొత్త రోడ్లు, ైప్లె ఓవర్లు,గ్రేడ్ సపరేటర్లు, రైల్వేఓవర్ బ్రిడ్జిలు, రోడ్డు అండర్‌బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టింది. దుర్గంచెరువుపై నిర్మించిన 233.85 మీటర్ల కేబుల్ వంతెన ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ట్రా డోస్డ్ కేబుల్‌బ్రిడ్జి. ఎస్సార్డీపీలో భాగంగా ముఖ్యమైన జంక్షన్లలో 9 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 3 ఆర్వోబీలు, దుర్గంచెరువుపై కేబుల్‌బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. ప్రధాన రహదారులకు అనుసంధానంగా రూ. 313.65 కోట్లతో 126.2 కి.మీ. మేర 137 లింక్ రోడ్ల నిర్మాణం సాగుతున్నది.
అంతర్జాతీయ ప్రమాణాలతో రవాణా వ్యవస్థ
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రయాణాలతో రోడ్డు రవాణా మార్గాలను అభివృద్ధిచేశారు. పౌరుల ఆరోగ్యం, భద్రత, ఆర్థిక అవకాశాలు, పనిపరిస్థితులు, విశ్రాంతి తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన రహదారులను ఏర్పాటు చేశారు. రూ.16,622 కోట్లతో వ్యూహాత్మక రహదారి అభివృద్ధిప్రణాళిక (ఎస్సార్డీపీ), నమూనా రహదారి కారిడార్లు, అనుసంధానరోడ్లు(హెచ్చాఆర్‌డీసీఎల్), సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం(సీఆర్‌ఎంపీ), హైవే ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ (హెచ్‌టీఎంఎస్), ఔటర్ రింగ్ రోడ్డుతో ప్రధాన మార్గాలను సిగ్నల్ ఫ్రీగా మార్చారు.
ఆకుపచ్చని హైదరాబాద్
గ్రీన్ హైదరాబాద్‌లో భాగంగా ఆరేండ్లలో రూ.332.70 కోట్లను వెచ్చించి హెచ్‌ఎండీఏ పరిధిలో 807 లక్షల మొక్కలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 486లక్షల మొక్కలను నాటారు. ఉమ్మడి పాలనలో ఎడారిలా మారిన రిజర్వుఫారెస్ట్ బ్లాక్‌లను ఆర్బన్ పార్కులుగా అభివృద్ధి చేశారు. 80చోట్ల మియావాకి పద్ధతిలో అడవుల పెంపకం చేపట్టారు. రూ.250 కోట్లతో జీహెచ్‌ఎంసీ పరిధిలో 934పార్కులు, 460 ట్రీ పార్కులు, రూ.134 కోట్లతో 58 థీమ్‌పార్కులు, 17 పంచ తత్వ పార్కులతోపాటు టెర్రస్ గార్డెన్లను ప్రోత్సహించేం దుకు 500 నర్సరీలను ఏర్పాటు చేశారు. నగర ప్రధాన కూడళ్లను అందంగా ముస్తాబుచేశారు.