వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మృతి

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల విక్రమ్‌రెడ్డి(28) దుర్మణం పాలయ్యారు. ఏఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. విక్రమ్‌రెడ్డి మంగళవారం ఉదయం వ్యవసాయ పొలం పనులకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి తన ద్విచక్రం వాహనంపై బయటకు వెళ్లారు.తిరుగు ప్రయాణంలో సిరిసిల్ల నుంచి వస్తున్న బానోతు గంగు ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో విక్రమ్‌రెడ్డి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మరణించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై వివరించారు. ఆయనకు తల్లిదండ్రులు మంజుల– సత్యంరెడ్డి ఉన్నారు. వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం బలోపేతం కోసం ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు.