ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

మూడు నెలల కిందట కెనడా నుంచి వచ్చిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మొయినాబాద్‌ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని శ్రీరాంనగర్‌ గ్రామానికి చెందిన అత్తాపురం చంద్రారెడ్డి, ప్రమద దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు.

కూతురుకు వివాహం కాగా పెద్ద కొడుకు అత్తాపురం నవీన్‌కుమార్‌రెడ్డి(29) ఐదేళ్ల కిందట చదువుకోవడానికి కెనడా వెళ్లాడు. చిన్నకొడుకు అనుదీప్‌రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తూ డబ్బులు పంపడంతో తల్లిదండ్రులు మొయినాబాద్‌ మండల కేంద్రంలో అద్దెకు ఉంటూ కొత్త ఇళ్లు నిర్మిస్తున్నారు. అయితే పెద్ద కొడుకు నవీన్‌కుమార్‌రెడ్డి మూడు నెలల క్రితం కెనడా నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులతోపాటే మొయినాబాద్‌ ఉంటున్నాడు.

మూడు నెలలుగా ఉద్యోగం దొరక్కపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. ఆదివారం తల్లిదండ్రులు బందువుల వద్దకు వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. బెడ్‌రూం తలుపులు పెట్టుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి 10.30గంటల సమయంలో తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో కిటికీలో నుంచి లోపలికి చూడగా నవీన్‌కుమార్‌రెడ్డి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు.

వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిచూశారు. అప్పటికే మృతి చెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.