వ్యక్తి ప్రాణాలు బలిగొన్న 18 ఏళ్ల కుర్రాడు

నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొన్నాడో 18 ఏళ్ల కుర్రాడు. కటకటాలపాలై జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని వసంత్‌ విహార్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన ఆంటోని జోసెఫ్‌(55), వసంత్‌ విహార్‌లోని అమెరికా ఎంబసీ అధికారి ఇంట్లో పనికి కుదిరాడు. ఆయన భార్య కూడా అదే ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్నారు. దీంతో వీరిద్దరికి అక్కడే సర్వంట్‌ క్వార్టర్స్‌లో నివాసం కల్పించారు.

ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి సమయంలో ఆంటోనీ స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా, మెర్సిడెస్‌ కారు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఆర్యన్‌ జైన్‌గా గుర్తించారు. యూపీకి చెందిన వజ్రాల వ్యాపారి సుశీల్‌ జైన్‌ కుమారుడైన అతడు ప్రస్తుతం ఉన్నత విద్యనభ్యసిస్తున్నాడని, యాక్సిడెంట్‌ చేసి ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన అతడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.