ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

ఇల్లు అమ్మనివ్వడం లేదని ఓ యువకుడు సెల్ఫీ తీసుకుంటూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్‌కు చెందిన గుగులోత్‌ సత్తమ్మ బయ్యారం జూనియర్‌ కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తూ బయ్యారంలో ఓ ఇంటిని కిరాయికి తీసుకుని ఉంటోంది. లాక్‌డౌన్‌కు ముందు హైదరాబాద్‌లో భార్యతో కలసి నివాసం ఉండే కుమారుడు ప్రశాంత్‌(30) తల్లి వద్దకు వచ్చి ఇక్కడే ఉంటున్నారు.

అయితే వీరికి మహబూబాబాద్‌లో ఓ ఇల్లు ఉండగా దానిని అమ్మేసి హైదరాబాద్‌కు వెళ్లిపోదామని ఇటీవల ప్రశాంత్‌ తన తల్లితో వాదన పెట్టుకున్నాడు. ఇందుకు అంగీకరించకపోవటంతో ప్రశాంత్‌ సోమవారం..తల్లి లేని సమయం చూసి భార్యను వేరే గదిలో ఉంచి గడియపెట్టాడు. ఆ తరువాత సెల్ఫీ తీసుకుంటూ ఫ్యానుకు ఉరివేసుకుంటున్న దృశ్యాలను బంధువులకు పంపించి..ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రశాంత్‌ భార్య ఆరునెలల గర్భవతి కాగా.. కుటుంబసభ్యులు మంగళవారం శ్రీమంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఇలా జరగడం అందరిలోనూ విషాదం నింపింది.