భర్త మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలి

తెలంగాణలోని గల్ఫ్‌ ఇమ్మిగ్రెంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళకు అండగా నిలబడింది. ఫోరం కార్యకర్తల చొరవతో సౌదీ అరేబియాలో పూడ్చిపెట్టిన తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని అంజూశర్మ అనే మహిళ న్యాయపోరాటం చేపట్టింది. వివరాలిలా ఉన్నాయి.. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన సంజీవ్‌కుమార్‌ (49) 23 సంవత్సరాల నుంచి సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. అయితే గుండెపోటు రావడంతో ఆయన జనవరి 24న సౌదీలోని భీష్‌ జనరల్‌ ఆస్పత్రిలో మృతిచెందాడు.

ఈ విషయాన్ని సంజీవ్‌కుమార్‌ పనిచేస్తున్న కంపెనీ ప్రతినిధులు అతని కుటుంబ సభ్యులకు తెలియజేయగా, తన భర్త మృతదేహాన్ని ఇంటికి పంపించాలని అంజూశర్మ వేడుకుంది. అయితే జెద్దాలోని భారత కాన్సులేట్‌ కార్యాలయంలోని ట్రాన్స్‌లేటర్‌ చేసిన తప్పిదం వల్ల సంజీవ్‌కుమార్‌ను ముస్లింగా భావించి ఆ మత సంప్రదాయాల ప్రకారం ఫిబ్రవరి 18న పూడ్చిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని సంజీవ్‌కుమార్‌ భార్య అంజూశర్మకు జెద్దాలోని మన విదేశాంగ శాఖ కార్యాలయం తెలియజేసింది. అంతేకాక తమ ట్రాన్స్‌లేటర్‌ పొరపాటుకు విదేశాంగ శాఖ అధికారులు క్షమాపణలు కోరారు.

సంజీవ్‌కుమార్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా సంజీవ్‌కుమార్‌కు సన్నిహితుడైన నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌కు చెందిన ఎనుగందుల గణేశ్‌ ఈ విషయాన్ని ఇమ్మిగ్రెంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం చైర్మన్‌ మంద భీంరెడ్డికి వివరించారు. దీనికి స్పందించిన భీంరెడ్డి, అంజూశర్మను సంప్రదించారు. ఆమె తన భర్త మృతదేహాన్ని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని భీంరెడ్డిని వేడుకుంది. ఈ క్రమంలో భీంరెడ్డి చొరవతో ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు.

సంప్రదాయాలకు విరుద్ధంగా ఎలా అంత్యక్రియలను నిర్వహిస్తారని ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి, గురువారం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని విదేశాంగ శాఖ అధికారులకు నోటీసులు జారీ చేశారు. అలాగే జెద్దాలోని మన విదేశాంగ శాఖకు కూడా నోటీసులు పంపించారు. ఈ విషయంలో ఇమ్మిగ్రెంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం చొరవను కార్మిక సంఘాలు అభినందిస్తున్నాయి.