మహిళ దారుణ హత్య

కల్లకురిచ్చి సమీపంలో శుక్రవారం మహిళ దారుణ హత్యకు గురైంది. కచ్చిరాయపాళయం అమ్మాపేట గ్రామానికి చెందిన మనోహర్‌ (45), సంగీత (35) దంపతులకు సురేష్, గోకుల్‌ కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం మనోహర్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. సంగీత కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. శుక్రవారం ఉదయం సంగీత బలరామ్‌పట్టు బస్టాండు సమీపంలోని మట్టపారై వెళ్లే రోడ్డులో శవంగా కనిపించింది. శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి.

సమాచారం అందుకున్న కల్లకురిచ్చి డీఎస్పీ రామనాథన్, కచ్చిరాయపాళయం పోలీసు ఇన్‌స్పెక్టర్‌ రామ్‌రాజ్‌ అక్కడికి చేరుకుని పరిశీలించారు. సంగీత మృతదేహాన్ని కల్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ప్రాథమిక విచారణలో సంగీతకు అత్తియూరుకు చెందిన యువకుడికి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఈ తగాదాలో ఆమె హత్యకు గురై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.