భర్తను గొంతుకోసి హత్య చేసిన భార్య

తనను తరుచూ పిచ్చిదంటూ ఎగతాళి చేస్తున్నాడన్న కోపంతో ఓ మహిళ భర్తను గొంతుకోసి హత్య చేసింది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మర్వాహిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మర్వాహి జిల్లా అమదేదా గ్రామానికి చెందిన విధ్యా పైక్రా(32) మానసిక పరిస్థితి బాగోలేదు. దీంతో భర్త అనూప్‌ సింగ్‌ పైక్రా, అత్త ఆమెను ‘పిచ్చిదానా’ అంటూ ఎగతాళి చేసేవారు. దీంతో ఆమె వారితో గొడవపడేది. ఆదివారం రాత్రి కూడా ఈ విషయమై గొడవ జరిగింది.

ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన విధ్యా సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిద్రలేచి, గాఢనిద్రలో ఉన్న భర్త గొంతును కత్తితో కోసి చంపింది. అనంతరం 1,2,4 సంవత్సరాల వయసు కలిగిన ముగ్గురు ఆడపిల్లలను బయటకు తీసుకెళ్లి, దగ్గరలోని బావిలో తోసేసింది. వారు నీటిలో పడి సహాయం కోసం అరవటం ప్రారంభించారు. ఆ అరుపులు విన్న ఇరుగుపొరుగు అక్కడికి చేరుకుని చిన్నారులను బయటకు తీశారు. ఆమె అనూప్‌ను హత్య చేయటం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను అరెస్ట్‌ చేసిన పోలీసులు కౌన్సిలింగ్‌ ఇప్పిస్తున్నారు.